కోమటిరెడ్డి శ్రీనిధి, దామోదర త్రిష. ఎంపీ టికెట్లు అడుగుతున్న కాంగ్రెస్ లీడర్ల బిడ్డలు
నల్గొండ ఎంపీ సీటుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి దరఖాస్తు చేశారు. ఇక్కడ మరో సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.
వారసత్వం అంటే కొడుక్కేనా.. కుమార్తెలకు ఉండదా.. ఎందుకుండదు అంటున్నారు టీపీసీసీ నేతల కుమార్తెలు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల కోసం సీనియర్ మహిళా నేతలతోపాటు తామూ అంటూ పోటీపడుతున్నారు. రేణుకా చౌదరి, నేరెళ్ల శారద వంటి నేతల అడుగు జాడల్లో రాజకీయాల్లో ముందడుగు వేయాలని భావిస్తున్నారు.
కోమటిరెడ్డి కుమార్తె, రాజనర్సింహ బిడ్డ
నల్గొండ ఎంపీ సీటుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి దరఖాస్తు చేశారు. ఇక్కడ మరో సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు టికెట్ ఆశిస్తుండటం గమనార్హం. భువనగిరి ఎమ్మెల్యే కుంభా అనిల్ కుమార్తె కీర్తి రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కావాలంటున్నారు. జహీరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీకి మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష సై అంటున్నారు.
భట్టి సతీమణి సైతం
నా భర్త డిప్యూటీ సీఎం అయితేనేం, ఆయన కోటా ఆయనది నా వాటా నాది అంటున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలంటూ ఆమె దరఖాస్తు చేశారు. ఇదే స్థానం నుంచి పోటీకి సీనియర్ నేత, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సై అంటున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి అడుగుతున్నారు. చేవెళ్ల నుంచి అవకాశం కల్పించాలని పారిజాత నర్సింహరెడ్డి దరఖాస్తు చేశారు. ఇలా మహిళా నేతలంతా ఎంపీ టికెట్లపై గురిపెట్టారు.