Telugu Global
Telangana

బీజేపీకి బిగ్ షాక్.. మళ్లీ కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

బీజేపీకి బిగ్ షాక్.. మళ్లీ కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ కి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికలకు కారణం అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాది తిరిగేసరికి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎందుకంటే..?

తిరిగి కాంగ్రెస్ లో ఎందుకు చేరాల్సి వస్తోందనే విషయాన్ని ప్రజలకు ఓ ప్రకటన ద్వారా వివరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగినా.. ఇప్పుడు కొంత డీలా పడిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారని, అందుకే తాను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

15నెలల క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఎన్నికల్లో బరిలో దిగి బీఆర్ఎస్ ని ఓడించినంత పని చేశానని తన ప్రకటనలో తెలిపారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో బీఆర్ఎస్ గెలుపు కోసం 100మంది ఎమ్మెల్యేలను ప్రచారానికి దింపి, మరో వంద కోట్ల నగదుని కుమ్మరించారని, అధికార దుర్వినియోగంతో వారు గెలిచినా, నైతిక విజయం తనదేనన్నారు. కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేకపోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని అన్నారాయన.

కాంగ్రెస్ లోకి మారాలనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కొన్నిరోజులుగా బీజేపీతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. ప్రధాని మోదీ మీటింగ్ లకు కూడా డుమ్మా కొట్టారు. ఆ తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కీలక పదవి ఇచ్చినా ఆయన ఎందుకో బీజేపీలో ఇమడలేకపోయారు. ఇటీవల బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో కూడా ఆయన పేరు లేదు. ఇప్పుడు ఆయన అధికారికంగా తాను బీజేపీకి దూరమవుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పూర్వ వైభవం దక్కుతుందో లేదో చూడాలి.

First Published:  25 Oct 2023 11:55 AM IST
Next Story