ఎంపీ టికెట్ వద్దు.. మంత్రి పదవే - కోమటిరెడ్డి
పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందంటూ తన మనసులో మాట బయటపెట్టారు రాజగోపాల్ రెడ్డి.
భువనగిరి ఎంపీ టికెట్ కోసం తన భార్య కోమటిరెడ్డి లక్ష్మి ప్రయత్నిస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా ఇదే అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కొందరు తనపై ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి తన భార్య లక్ష్మి సిద్ధంగా ఉందన్నారు.
పార్టీలో చేరినప్పుడు తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందంటూ తన మనసులో మాట బయటపెట్టారు రాజగోపాల్ రెడ్డి. తన కుటుంబానికి మూడో టికెట్ కోరుకోవడం లేదన్నారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని తానే ప్రతిపాదించానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను విడదీయడం ఎవరితరం కాదన్నారు. తాము పదవుల కోసం పాకులాడడం లేదన్నారు.
ఇప్పటివరకూ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. భువనగిరి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తోంది. భువనగిరి ఎంపీ టికెట్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఇక భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ను ఖరారు చేయగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు.