Telugu Global
Telangana

కోమటిరెడ్డి ఆన్ డ్యూటీ.. టీకాంగ్రెస్ లో మళ్లీ ఫైటింగ్

సీతక్క సీఎం అనే వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దళితులు, గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే తమ పార్టీలో పొదెం వీరయ్య, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ ఉన్నారని గుర్తు చేశారు.

కోమటిరెడ్డి ఆన్ డ్యూటీ.. టీకాంగ్రెస్ లో మళ్లీ ఫైటింగ్
X

ఈమధ్య టీకాంగ్రెస్ నేతల్ని ఢిల్లీకి పిలిపించి కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు రాహుల్ గాంధీ. పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేయొద్దన్నారు. అయితే రోజుల వ్యవధిలోనే ఆ నియమాన్ని పక్కనపెట్టారు నేతలు. అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడంతో వాటిని వెంటనే ఖండించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రైతులకు 3 గంటలే కరెంటు ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పీసీసీ అనేది చాలా చిన్న పోస్ట్ అని, పీసీసీ చెప్పినవన్నీ ఫైనల్ కావాలని లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతామన్నారు కోమటిరెడ్డి. స్టార్ క్యాంపెయినర్ గా తానీమాట చెబుతున్నామని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అనేది తమ మేనిఫెస్టోలో కూడా ఉంటుందని స్పష్టం చేశారు.

బాలయ్య ప్రభావమా..?

రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నప్పుడు జాగ్రత్తగానే మాట్లాడేవారని, అమెరికా వెళ్లిన తర్వాత ఆయనపై పాత మిత్రుడు బాలయ్య ప్రభావం పడిందోమోనని సెటైర్లు పేల్చారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తున్నామని, ఆయన తెలంగాణకు తిరిగొచ్చిన తర్వాత ఆయనతోనే ప్రెస్ మీట్ పెట్టించి వివరణ ఇప్పిస్తామన్నారు. 24 గంటల్లో 24 సెకన్లు కూడా కరెంటు సరఫరా తగ్గించడానికి వీల్లేదన్నారు.

సీతక్క సీఎం..!

సీతక్క సీఎం అనే వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ని నమ్ముకుని ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. దళితులు, గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే తమ పార్టీలో పొదెం వీరయ్య, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ ఉన్నారని గుర్తు చేశారు. సీఎం పదవిపై రేవంత్ రెడ్డి మాటలు ఫైనల్ కాదని తేల్చేశారు.

పాత నాయకులు, కొత్త నాయకులు..

కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో పదే పదే సీనియర్లు, పాత నాయకులనే పదాలు వినిపించాయి. టీపీసీసీ చీఫ్ అయినంత మాత్రాన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలేవీ ఫైనల్ కావని అన్నారాయన. రేవంత్ రెడ్డి గందరగోళంగా మాట్లాడారని, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సర్దుకుంటాయని చెప్పారు. ఫైనల్ గా కాంగ్రెస్ లో మరోసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపగా, కోమటిరెడ్డి కౌంటర్లు మరింత సంచలనంగా మారాయి.

First Published:  11 July 2023 2:48 PM IST
Next Story