Telugu Global
Telangana

వేడి పుట్టిస్తున్న మునుగోడు రాజకీయాలు....కోమటి రెడ్డి బ్రదర్స్ Vs రేవంత్

మునుగోడు రాజకీయాల్లో వేడి పెరిగింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక జరుగుతున్న పరిణామాలు కోమటి రెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారిపోతున్నాయి.

వేడి పుట్టిస్తున్న మునుగోడు రాజకీయాలు....కోమటి రెడ్డి బ్రదర్స్ Vs రేవంత్
X

ఈటల రాజేందర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి సవాళ్లతో హుజురాబాద్ వేడెక్కగా ఇప్పుడు చుండూరు కూడా అదే వరసలో ఉండేట్టు కనిపిస్తోంది. నీకు దమ్ముంటే చుండూరులో బహిరంగ చర్చకు రావాలని రాజగోపాల రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. సవాలు చేశారు. బీజేపీ రాగాలు పలుకుతున్న ఆయనపై ఎన్నో పోలీసు కేసులు ఉన్నాయని, కాంట్రాక్టులతో ఎలా ఎదిగాడో తాను వివరిస్తానని అన్నారు. నామీద 120 కేసులున్నాయి.. ఒప్పుకుంటున్నా.. మరి మీపై ఎన్ని కేసులున్నాయో చెప్పాలన్నారు. కాంట్రాక్టుల కోసమే ఆయన బీజేపీలో చేరుతున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల రెడ్డి ఏ పోరాటం చేశారని ప్రశ్నించారు. సమస్యలపై ఆయన ఏనాడైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారా అని కూడా అన్నారు. చుండూరులో ఇద్దరం బహిరంగ చర్చ చేద్దామని ఛాలెంజ్ విసిరారు. శుక్రవారం రాజగోపాల రెడ్డి ఢిల్లీ చేరి బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయనపై ఫైరయ్యారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తనపై చేసిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ కోసం పని చేస్తారని, ఆయనను తాను మీరు అని గౌరవంగా సంబోధించానే తప్ప అగౌరవపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు. వెంకటరెడ్డి మా వారే అని వ్యాఖ్యానించారు.

మరో వైపు అసలే తన సోదరుడు రాజగోపాలరెడ్డిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలతో భగ్గుమంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు తాజాగా మరో 'అస్త్రం' దొరికింది. తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చెరుకు సుధాకర రెడ్డి విషయంలో రేవంత్ తీసుకున్న చొరవను ఆయన ప్రశ్నించారు. సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చూసిన రేవంత్ అత్యుత్సాహాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. తనను ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నించిన సుధాకర్ ని కాంగ్రెస్ లో ఎలా చేర్చుకుంటారని అన్నారు. మునుగోడుకు తానిప్పుడు వెళ్లే ప్రసక్తే లేదని, పార్లమెంటు సమావేశాలయ్యాకే వెళ్తానని తెలిపారు. అంటే చుండూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగసభకు వెళ్లబోనని పరోక్షంగా చెప్పేశారు. అసలు నేను రేవంత్ ముఖం కూడా చూడను అని వెంకటరెడ్డి ఆవేశంగా వ్యాఖ్యానించారు.

ఈ తాజా వ్యవహారం చూస్తుంటే సోదరుని మాదిరే వెంకట రెడ్డి కూడా బీజేపీ రాగాలు పలకడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. పైగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. వెంకటరెడ్డి తమతో టచ్ లో లేరని చెప్పజాలమన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా మోడీ, అమిత్ షా ఆహ్వానిస్తారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణాలో చాలామంది టీఆరెస్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 12 న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ తరుణ్ ఛుగ్ హైదరాబాద్ వస్తున్నారు. ఆ సందర్భంగా కొన్ని జంపింగ్ లు ఉండే సూచనలున్నాయి. తెలంగాణాలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రక్రియని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మునుగోడు ఉప ఎన్నిక, రాజగోపాల రెడ్డి ఎపిసోడ్ ఇందుకు ఈ పార్టీని ప్రేరేపిస్తున్నాయి.




First Published:  5 Aug 2022 2:48 PM IST
Next Story