Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

'రేవంత్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు. వాటిని బయట పెడితే నువ్వు ఎవ‌రికీ ముఖం చూపించుకోలేవు. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు పోయేకాలం దగ్గరకు వచ్చింది. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో అడుగుకూడా పెట్టనివ్వను'

రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
X

తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే అక్కడ బహిరంగ సభ నిర్వహించి ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. ఇక సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. మునుగోడు సీటును నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం బృందాల వారీగా పర్యటనలు చేశారు. గత నెలలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థంతోనే ఈ ఎన్నిక వచ్చింద‌ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

మునుగోడు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన రాజగోపాల్.. ఇక బీజేపీలో చేరిన తర్వాత విమర్శల డోసు పెంచారు. తాజాగా ఆదివారం కూడా రేవంత్ లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్‌మెయిలర్ అనీ, నా జోలికొస్తే తన చరిత్ర మొత్తం బయటపెడతానని రాజగోపాల్ అన్నారు. 'రేవంత్, నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో నాకు తెలుసు. వాటిని బయట పెడితే నువ్వు ఎవ‌రికీ ముఖం చూపించుకోలేవు. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు పోయేకాలం దగ్గరకు వచ్చింది. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో అడుగుకూడా పెట్టనివ్వను' అని రాజగోపాల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సమాచార హక్కు చట్టాన్ని మంచి లక్ష్యం కోసం అమలులోకి తెస్తే.. రేవంత్ రెడ్డి దాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు బ్లాక్ మెయిల్ ద్వారా సంపాదించాడు. హైదరాబాద్‌లోనే ఇలా ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ ఆరోపించారు. పీసీసీ పదవిని డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి మనిషిని పీసీసీ అధ్యక్షుడిని చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నీదొక నేర, అవినీతి చరిత్ర. నీలాంటి వాడికి ఓ పార్టీ జెండా కావాలి. కానీ నాకు అలాంటి అవసరం లేదు. నేను కావాలనుకుంటే మునుగోడు నుంచి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి గెలుస్తాను అని రాజగోపాల్ చెప్పారు.

గత ఇరవై రోజులుగా చాలా ఓపికగా ఉన్నాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దు. నేను అమ్ముడు పోయినట్లు ఆధారాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కునే దమ్ములేకనే ఇలా పనికిమాలిన మాటలన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నావు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇప్పటికైనా మారకపోతే నీ చరిత్ర మొత్తం బయటపెడతాను అని రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

First Published:  5 Sept 2022 7:58 AM IST
Next Story