Telugu Global
Telangana

సొంతగూటికి చేరాలనుకుంటున్న రాజగోపాలుడు!?

మానసికంగా బీజేపీకి దూరమైన రాజగోపాల్‌ను కాంగ్రెస్‌ గూటికి చేర్చేందుకు ఆయన సోదరుడు వెంకట్‌ రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ వద్ద కూడా ప్రస్తావించారట. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం కండిషన్స్‌ అప్లయ్డ్‌ అంటోంద‌ని స‌మాచారం.

సొంతగూటికి చేరాలనుకుంటున్న రాజగోపాలుడు!?
X

మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారట. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంతో ఇప్పటికే మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం రాజగోపాల్‌కు కండిషన్స్‌ పెట్టింది. బీజేపీలో చేరి ఉన్న సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయిన రాజ్‌గోపాల్‌ రెడ్డి పునరాలోచనలో పడ్డాడట. మునుగోడు ఉప ఎన్నిక‌లో ఓటమిని మూటగట్టుకున్న నాటి నుంచీ ఆయన కాషాయ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు. బీజేపీలో సరైన గౌరవం దక్కడం లేదనే ఆవేదనను కొంతకాలంగా సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సొంతగూటికి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చేందుకు ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారట. కాంగ్రెస్‌ అధిష్టానం ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చూపనప్పటికీ టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌ మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదట. బీజేపీలో చేరిన నేతలంతా కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసిరావాలని పిలుపునిచ్చిన రేవంతే రాజగోపాల్‌ రాకను ఆహ్వానించడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ మాజీ ఎంపీల చుట్టూ తిరిగి పార్టీలోకి రావాలనుకుంటున్నట్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన నాటి నుంచీ బీజేపీతో పెద్దగా మమేకం కాలేకపోయిన రాజగోపాల్‌ రెడ్డి కాషాయ పార్టీ కార్యకలాపాల పట్ల ఎప్పటికప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. మానసికంగా బీజేపీకి దూరమైన రాజగోపాల్‌ను కాంగ్రెస్‌ గూటికి చేర్చేందుకు ఆయన సోదరుడు వెంకట్‌ రెడ్డి గట్టి ప్రయత్నమే చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ వద్ద కూడా ప్రస్తావించారట. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం కండిషన్స్‌ అప్లయ్డ్‌ అంటోంద‌ని స‌మాచారం.

రాజగోపాల్‌కు సన్నిహితంగా ఉండే బీజేపీ నేతలను కూడా కాంగ్రెస్‌లో చేర్చేలా ప్రయత్నించాలని సూచించిందట. కర్నాటక ఫలితాల తరువాత బీజేపీ నేతల్లో జోష్‌ తగ్గింది. ఇటు కాంగ్రెస్‌లో హుషారు పెరిగింది. ఈ సందర్భంలో బీజేపీలో అసంతృప్తితో ఉన్న వారిని ఆకర్షించాలనుకుంటోంది కాంగ్రెస్‌. ఇప్పుడా బాధ్యతల్ని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా నడిచింది. కానీ, ఇప్పుడు బీజేపీలో చేరిన తమ్ముడిని తిరిగి కాంగ్రెస్‌కి చేర్చేందుకు వెంకట్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

First Published:  20 Jun 2023 5:36 AM GMT
Next Story