Telugu Global
Telangana

సోనియా, రాహుల్‌ని తిట్టను.. రేవంత్‌పై రాజగోపాల్ ఫైర్‌..

చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్‌ పని చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ చచ్చి పోయిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. 12 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు ఏం పీకారు అని విమర్శించారు.

సోనియా, రాహుల్‌ని తిట్టను.. రేవంత్‌పై రాజగోపాల్ ఫైర్‌..
X

కాంగ్రెస్ నుంచి బయటకెళ్లిపోయినవారు సహజంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. నాయకత్వ లేమితో పార్టీకి భవిష్యత్ లేదని, అందుకే బయటకొచ్చామని చెప్పుకుంటారు. కానీ తాజాగా పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సోనియా, రాహుల్ ని తాను పల్లెత్తు మాట అనబోనని తేల్చి చెప్పారు. వారిని తాను విమర్శించబోనంటూనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆయన వెనక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోదీ వేసిన ఎంగిలి మెతుకుల కోసం కాంగ్రెస్ ని రాజగోపాల్ రెడ్డి మోసం చేశారంటూ.. ఆయన రాజీనామా తర్వాత రేవంత్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి కూడా అంతే దీటుగా రేవంత్ ని టార్గెట్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్‌ పని చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ చచ్చి పోయిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. 12 మంది ఎమ్మెల్యే లు పార్టీ మారినప్పుడు ఏం పీకారు, ఇప్పుడు తాను పార్టీ మారితే అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ని నాశనం చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో 9 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే గొప్ప అని విమర్శించారు. పొన్నాల హయాంలో 21 మంది, ఉత్తమ్ హయంలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, రేవంత్ హయాంలో సింగిల్ డిజిట్ కి కాంగ్రెస్ స్కోర్ పడిపోతుందని జోస్యం చెప్పారు.

రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు..

రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జైలుకి పోలేదని, ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. తమకు వ్యాపారాలున్నాయని, తమ బ్రాండ్ ఇమేజ్ తో రాజకీయంగా ఎదిగామని చెప్పారు. కాంట్రాక్ట్ పనులకోసమే తాను పార్టీ మారానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. దమ్ముంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. అలా నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలన్నారు. మొత్తమ్మీద ప్రాణం పోయినా సోనియా, రాహుల్ ని విమర్శించను అంటున్న రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.

First Published:  3 Aug 2022 3:57 PM IST
Next Story