జూపల్లికి షాక్.. కొల్లాపూర్ కాంగ్రెస్‌లో కుదుపు!
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు టికెట్లు వలస నేతలకే ఇచ్చింది కాంగ్రెస్. కల్వకుర్తిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్‌కు అసంతృప్త నేతలు పెద్ద తలనొప్పిగా మారారు. తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతలపల్లి జగదీశ్వర రావు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొల్లాపూర్‌లో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేస్తానని స్ఫష్టంచేశారు. ఆ పార్టీ నుంచి ఇప్పటికే బీఫామ్ సైతం తీసుకున్న చింతలపల్లి.. జూపల్లిని ఓడిస్తానని శపథం చేశారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ అధిష్టానం కొల్లాపూర్ టికెట్ కేటాయించింది. దీంతో చింతలపల్లి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణిక్ రావు ఠాక్రే.. చింతలపల్లికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు టికెట్లు వలస నేతలకే ఇచ్చింది కాంగ్రెస్. కల్వకుర్తిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి, కసిరెడ్డికి మధ్య సయోధ్య కుదిరింది. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల్ స్థానాల్లో వలస నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
గద్వాల్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సరితా తిరుపతయ్యకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఆ జిల్లా డీసీసీ చీఫ్ పటేల్ ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి సైతం పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం నాగం వేచి చూసే ధోరణిలో ఉన్నారు.