కోకాపేట, బుద్వేల్.. నెక్స్ట్ ఏంటి..?
హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది HMDA. ఈ వేలం ద్వారా మరోసారి HMDA కి భారీ ఆదాయం సమకూరుతుంది.
మొన్న కోకాపేటలో ఎకరం 100కోట్ల రూపాయలు దాటి పలికింది. నిన్న బుద్వేల్ లో ఎకరం గరిష్టంగా 41.75కోట్ల రూపాయలకు చేరింది. మరి నెక్ట్స్ ఏంటి..? అనే ఆలోచన అందరిలో ఉంది. దానికి HMDA రంగం సిద్ధం చేసింది. నగర శివారులో మరో భారీ భూ వేలంపాటకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొకిలా ఫేజ్-2 భూ వేలంకు సంబంధించి HMDA ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద 300 ప్లాట్ల అమ్మకానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 300 ప్లాట్లలో మొత్తం 98,975 గజాలను HMDA వేలంలో అమ్మేయబోతోంది. ఒక్కో ప్లాట్ 300 గజాలనుంచి 500 గజాలు ఉంటుంది. ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈరోజు నుంచి ఆగస్ట్ 21 వ తేదీ వరకు వేలంలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు రూ. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయల చొప్పున అప్సెట్ ధరగా నిర్ణయించారు.
ఫేజ్ -1 ఇలా..
మొకిలా ఫేజ్-1లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఫేజ్-2 లో 800కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. HMDA అప్రూవ్డ్ లే అవుట్స్ కావడంతో కార్పొరేట్ కంపెనీలు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి. దానికి తగ్గట్టే భారీ అంచనాలతో వేలం మొదలవుతోంది.