Telugu Global
Telangana

కొడంగల్ లో రాళ్లదాడి.. కోస్గిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహం వద్ద కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

కొడంగల్ లో రాళ్లదాడి.. కోస్గిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
X

అచ్చంపేట ఘర్షణ మరచిపోకముందే ఇప్పుడు కొడంగల్ వేడెక్కింది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్లదాడి జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నారు, పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. మధ్యలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కోస్గిలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. రేవంత్ రెడ్డి పర్యటించిన గంటల వ్యవధిలోనే కోస్గిలో ఇలాంటి ఘటనలు జరగడం విశేషం.

కొడంగల్ కి గొడ్డళ్లు తీసుకుని బీఆర్ఎస్ నేతలు వస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే కోస్గిలో వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డికి చెందిన వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ కార్లను అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ నేతలు అతిగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహం వద్ద కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

ఇటీవల అచ్చంపేటలో కూడా బీఆర్ఎస్ నేతలు డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు వారిని వెంబడించారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి చేశారు. ఇప్పుడు కొడంగల్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బీఆర్ఎస్ నేతల వాహన శ్రేణిని కాంగ్రెస్ నేతలు వెంబడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు సర్జాఖాన్ పేటలో కూడా బీఆర్ఎస్ నేతల వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. బీఆర్ఎస్ కి చెందిన మహిళా నేతలపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారని అంటున్నారు.

First Published:  14 Nov 2023 9:42 PM IST
Next Story