కోదండరాం అస్త్ర సన్యాసం.. అవసరమైతే పార్టీ విలీనం
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని కోదండరాం ప్రకటించారు.
భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి మినహా.. తెలంగాణ పేరుతో వచ్చిన ఏ పార్టీని ప్రజలు ఆదరించలేదు, అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాంని కూడా కేసీఆర్ తో విభేదించిన తర్వాత ప్రజలు ఉద్యమ నాయకుడిగా చూడలేదు, రాజకీయ స్వలాభం కోసం పార్టీ పెట్టారనే అనుకున్నారు. అయితే కోదండరాం కూడా ఇప్పుడు అస్త్ర సన్యాసం చేస్తున్నారు. అవసరమైతే తన పార్టీని విలీనం చేస్తానంటున్నారు. అయితే ఏ పార్టీలో కలుపుతారనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఇకపై తాను రాజకీయ పోరాటం చేయలేనని మాత్రమే హింటిచ్చారు. సూర్యాపేటలో జరిగిన తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశాల్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2018 మార్చి 31న తెలంగాణ జనసమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు ప్రొఫెసర్ కోదండరాం. టీజేఏసీ చైర్మన్ గా తనకు వచ్చిన క్రేజ్ రాజకీయాల్లో కూడా కొనసాగుతుందనుకున్నారు. కానీ అదంతా వట్టి భ్రమేనని తేలిపోయింది. కోదండరాంకి ఎన్నికలు కలసి రాలేదు. కాంగ్రెస్ తో కలసి చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు పక్కన నిలబడటాన్ని తెలంగాణ వాదులు ఏమాత్రం సహించలేదు. కోదండరాం ఇమేజ్ కూడా బాగా డ్యామేజీ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆయనకు కలసి రాలేదు. దీంతో రాజకీయ పోరాటం చేయలేనని ఆయనకు అర్థమైంది.
అవసరమైతే పొత్తు లేకపోతే విలీనం..
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో తెలంగాణ జనసమితి విషయంలో కాస్త ముందుగానే నిర్ణయం తీసుకునేలా ఉన్నారు కోదండరాం. ఎవరూ పొత్తుకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో తనకు తానే తన నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా కలసి పనిచేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏ నిర్ణయానికైనా తాము సిద్ధమన్నారు. అవసరమైతే తమ పార్టీని విలీనం చేస్తామని కోదండరాం ప్రకటించారు.