ఎమ్మెల్సీ పోయిందనే అసహనం.. కేసీఆర్ పై కోదండరాం అక్కసు
కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి సిఫార్సు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వల్ల సందిగ్ధంలో పడింది. బీఆర్ఎస్ వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి ఆలస్యమవుతుందనే అక్కసు ఆయనలో ఉంది.
మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉంది. ఆ బ్యారేజీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. నిర్మాణంలో లోపాలున్నాయని చెబుతూ, లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే అంశాన్ని హైలైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. బీఆర్ఎస్ అంటే గిట్టనివారెవరైనా నిర్మాణంలో లోపాలున్నాయనే ఆరోపణలు చేయడం సహజం. కానీ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అసలు ప్రాజెక్టే అనవసరం అంటున్నారు. ఆయన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని అంటున్న కోదండరాం.. కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా అప్పటి సీఎం కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మించారని విమర్శించారు. సదరు ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరాకు నీరందించడానికి 46 వేల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం విద్యుత్ కాళేశ్వరం నిర్వహణకు అవసరం ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూకంపలు వచ్చే ప్రమాదం ఉందని కూడా అన్నారు. ఇన్ని చెబుతున్న కోదండరాం గతంలో ఎప్పుడూ ఆ ప్రాజెక్ట్ పై ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడలేదన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఎమ్మెల్సీ దక్కలేదన్న అక్కసుతోనా..?
కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి సిఫార్సు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వల్ల సందిగ్ధంలో పడింది. బీఆర్ఎస్ వల్లే తనకు ఎమ్మెల్సీ పదవి ఆలస్యమవుతుందనే అక్కసు ఆయనలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్తగా కాళేశ్వరంపై కోదండరాం విమర్శలు ఎక్కుపెడుతున్నారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రాజెక్ట్ అవసరం లేదంటూ ఆయన ఇప్పుడు రాద్ధాంతం చేయడం అర్థరహితమని విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద కాళేశ్వరం అవసరమే లేదంటూ తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తిరిగి ఆయనకే రివర్స్ లో తగలడం విశేషం.