ఎమ్మెల్సీ రగడ.. గవర్నర్ కు బీజేపీ సపోర్ట్
కవులు, కళాకారులు, సేవ చేసే వారికి.. గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారని అంటున్నారు కిషన్ రెడ్డి. గవర్నర్.. గవర్నర్ గా వ్యవహారించారు కాబట్టే.. ఎమ్మెల్సీ సిఫార్సులను రిజెక్ట్ చేశారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసిన ఇద్దరిని సేవారంగంలో ఎమ్మెల్సీలుగా ఖరారు చేసేందుకు గవర్నర్ తమిళిసై అడ్డు చెప్పడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. గవర్నర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా రాజకీయ పదవిలో ఉన్న తమిళిసై నేరుగా తెలంగాణకు గవర్నర్ గా రావడాన్ని గుర్తు చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నవారికి సేవారంగం నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తే తప్పేంటని నిలదీస్తున్నారు. అసలు రాజకీయాల్లోనుంచి గవర్నర్ పదవికి తమిళిసై ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఈ దశలో బీజేపీ నేతలు గవర్నర్ కు మద్దతుగా నిలిచారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. తెలంగాణ గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించారు.
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను తమిళిసై తిరస్కరించడంతో గొడవ మొదలైంది. కవులు, కళాకారులు, సేవ చేసే వారికి.. గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారని అంటున్నారు కిషన్ రెడ్డి. పార్టీలు ఫిరాయించినవారు, బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నవారిని ఈ కేటగిరీలో ఎలా ఎమ్మెల్సీలుగా చేస్తారని అంటున్నారాయన. సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ని, పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గవర్నర్.. గవర్నర్ గా వ్యవహారించారు కాబట్టే.. ఎమ్మెల్సీ సిఫార్సులను రిజెక్ట్ చేశారన్నారు.
మరోవైపు గవర్నర్ వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోడానికి, అడ్డుచెప్పడానికే గవర్నర్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గతంలో కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో కూడా గవర్నర్ ఇలాగే చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లు విషయంలో కూడా గవర్నర్ తాత్సారం చేశారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అడుగడుగునా అడ్డు తగులుతున్న గవర్నర్ తెలంగాణకు వద్దని, వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.