Telugu Global
Telangana

ఢిల్లీకి కిషన్ రెడ్డి.. అధిష్టానం ముందు తెలంగాణ బీజేపీ పంచాయితీ

హైదరాబాద్ లో కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ అధిష్టానంతో ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీలో కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

ఢిల్లీకి కిషన్ రెడ్డి.. అధిష్టానం ముందు తెలంగాణ బీజేపీ పంచాయితీ
X

తెలంగాణ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరుకుంది. పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగడంతో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇద్దర్నీ ఢిల్లీకి పిలిపించి బుజ్జగిస్తోంది అధిష్టానం. ఈ క్రమంలో ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిపించారు. హైదరాబాద్ లో కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుని కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ అధిష్టానంతో ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీలో కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. పక్క పార్టీలనుంచి వచ్చినవారు బీజేపీలో నిలబడేలా లేరు. ఒకరకంగా వారికి పొగపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. బీజేపీలో ఏకైక బీసీ నాయకుడిగా ఎదిగిన బండి సంజయ్.. ఈటల రాజేందర్ రాకతో అభద్రతా భావానికి లోనయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఈటలకు రాష్ట్ర పార్టీ కార్యకలాపాల్లో ప్రాధాన్యత లేకుండా చేశారు. చేరికల కమిటీ చైర్మన్ అనే నామ్ కే వాస్తే పదవి ఇచ్చినా ఈటలలో అసంతృప్తి ఉంది. ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మునుగోడు ఉప ఎన్నికతో తేలిపోయింది. బీజేపీలో ఉంటే తన పరిస్థితి ఏంటనేది ఆయనకు తెలిసొచ్చింది. అప్పటికప్పుడు కాంట్రాక్ట్ ల కోసం కమలదళంలో చేరినా, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు కోసం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటున్నారాయన. అన్న‌ వెంకట్ రెడ్డి ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు, రాయబారం నడుపుతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్.. ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారనే విషయం అధిష్టానానికి అర్థమైంది. ఈ అసంతృప్తిని పెంచి పోషిస్తే ఇద్దరూ పార్టీ మారే అవకాశముంది. దీంతో ముందుగానే దిద్దుబాటు చర్యలు చేపట్టింది బీజేపీ అధిష్టానం. ఇద్దర్నీ ఢిల్లీకి పిలిపించింది. పనిలో పనిగా కిషన్ రెడ్డిని కూడా పిలిచి పంచాయితీ పెడుతోంది. అధిష్టానం బుజ్జగింపులకు ఆ ఇద్దరూ లొంగిపోతారా, లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  24 Jun 2023 12:05 PM IST
Next Story