ఇచ్చినవాటితో సంతోషపడండి.. కిషన్ రెడ్డి వెటకారం
ఏ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినా ఉద్యోగాలు వస్తే సరిపోతుందన్నారు. ఇచ్చినవాటితో సరిపెట్టుకోండని, ఇప్పటి వరకూ ఇచ్చినవన్నీ చెప్పినా ఎవరూ చప్పట్లు కూడా కొట్టడం లేదంటూ వెటకారమాడారు కిషన్ రెడ్డి.
తెలంగాణకు ఇచ్చిన వాటితో సంతోషపడాలని వెటకారమాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన తెలంగాణకు కేంద్రం ఏమేమిచ్చిందనే విషయంపై ఏకరువు పెట్టారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే ప్రశ్నకు ఆయన తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నారు. ఏ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినా ఉద్యోగాలు వస్తే సరిపోతుందన్నారు. ఇచ్చినవాటితో సరిపెట్టుకోండని, ఇప్పటి వరకూ ఇచ్చినవన్నీ చెప్పినా ఎవరూ చప్పట్లు కూడా కొట్టడం లేదంటూ వెటకారమాడారు కిషన్ రెడ్డి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తలకెత్తుకుందని, కేంద్రం మొదలు పెట్టకపోతే, తామే చేపడతామని సీఎం కేసీఆర్ చెప్పారని, అయినా ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
ఇదే కదా సాక్ష్యం..
తెలంగాణ బీజేపీలో లుకలుకల గురించి కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఓవైపు బండి సంజయ్ ని, మరోవైపు ఈటల రాజేందర్ ని కూర్చోబెట్టుకున్న ఆయన.. తమ మధ్య విభేదాలు లేవనడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. ప్రధాని కార్యక్రమ వివరాలు చెప్పేందుకు అందరూ కలసే వచ్చాం కదా అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై ఆయన స్పందించలేదు.
కాజీపేట అయోధ్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కి, ఈనెల 8న ప్రధాని మోదీ శంకుస్థాపనకు వస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మోదీకి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన వెయ్యి స్తంభాల గుడి కల్యాణ మండపం పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకుని రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం రూ.500 కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. యాదాద్రి వరకు MMTS విస్తరణకు రూ. 330 కోట్లతో ప్రణాళికకు ఆమోదం తెలిపామన్నారు కిషన్ రెడ్డి.