Telugu Global
Telangana

కేటీఆర్ వ్యాఖ్యలతో టీబీజేపీలో కంగారు

బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌ గా పాల్గొంటారని చెప్పారు కిషన్ రెడ్డి.

కేటీఆర్ వ్యాఖ్యలతో టీబీజేపీలో కంగారు
X

తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగకపోవచ్చంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపాయి. వాస్తవానికి జమిలి, మినీ జమిలి అంటూ ఆ పార్టీనుంచే సంకేతాలు అందుతున్నా తెలంగాణ బీజేపీ మాత్రం ఎందుకో కంగారుపడుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే కిషన్ రెడ్డి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తాజాగా బీజేపీ ఎస్సీ మోర్చా, బీజేవైఎం సమావేశాల్లో పాల్గొన్న ఆయన తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కావని చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.


ఈ నెల 17న సమైక్యతా దినోత్సవం కాకుండా అధికారికంగా హైదరాబాద్‌ విమోచన దినోత్సవం నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌ ముక్తి దివస్‌ పేరిట కర్నాటక, మహారాష్ట్రలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, తెలంగాణలో కూడా విమోచన దినోత్సవం పేరిటే ఉత్సవాలు జరగాలన్నారు. ఈ నెల 17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అమిత్ షా పాల్గొనే ఈ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌ గా పాల్గొంటారని చెప్పారు.

నేటినుంచి నిరుద్యోగ దీక్ష..

తెలంగాణలో నేటి నుంచి రెండు రోజులు నిరుద్యోగ దీక్ష చేపడతామన్నారు కిషన్ రెడ్డి. దీక్ష ముగిసిన మరుసటి రోజు ఈనెల 15న హైదరాబాద్‌– పరకాల బైక్‌ ర్యాలీ ఉంటుందని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్ లో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు కొందరు మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తున్నారని, విమోచన దినోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.

First Published:  13 Sept 2023 7:30 AM IST
Next Story