అది ఎలక్షన్ స్ట్రాటజీ.. కవర్ చేసుకున్న కిషన్ రెడ్డి
కిషన్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడంలేదు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఎన్నికల ప్రకటన విడుదల కాకముందే 97శాతం మంది అభ్యర్థుల్ని ప్రకటించింది బీఆర్ఎస్. ఆ స్పీడ్ తో పోల్చుకుంటే కాంగ్రెస్, బీజేపీది నత్త నడకకంటే ఘోరం. అయితే అది ఎన్నికల స్ట్రాటజీ అంటూ కవర్ చేసుకుంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నామినేషన్ల చివరి రోజు వరకూ అభ్యర్థుల్ని ప్రకటిస్తూనే ఉంటామన్నారు.
అభ్యర్థులు దొరక్క..
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అయినా సీట్లకోసం పోటీ ఉంది కానీ, బీజేపీలో అది కూడా లేదు. కీలక నేతలు కూడా అసెంబ్లీ బరిలో దిగేందుకు తటపటాయిస్తున్నారు, ఎంపీలుగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. అటు ఆశావహుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. దీంతో డూప్లికేట్ అప్లికేషన్లు పెట్టుకుని ఆహా ఓటో అంటూ ఇటీవల బాకాలూదుకున్నారు బీజేపీ నేతలు. బీజేపీ టికెట్లకోసం విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. కానీ వాస్తవానికి అక్కడ అభ్యర్థులు కరువయ్యారు, అందుకే జాబితా ఆలస్యమవుతోంది. కాంగ్రెస్ కూడా లిస్ట్ ప్రకటించేస్తే అసంతృప్తులకు ఏకైక ఆప్షన్ బీజేపీయే అవుతుంది. అందుకే సమయంకోసం కమలదళం ఎదురు చూస్తోంది. ప్యారాచూట్ నేతలకు కండువాలు కప్పి బీఫామ్ ఇచ్చేందుకు వేచి చూస్తోంది.
కిషన్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడంలేదు. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది తమ ఇష్టమని.. నామినేషన్ చివరి వరకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నామని అంటున్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే 50 శాతం వరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశామన్నారు.