ఢిల్లీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. కిషన్ రెడ్డి చేసేదేం లేదు : మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయం రంగంలో గొర్రెల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23,948 కోట్ల రుణాన్ని ఇచ్చింది. కేంద్ర ఇచ్చిన రుణాలను ఒక మంత్రి గొప్పగా చెప్పుకోవడం సమంజసమా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిందేమీ లేదు. ఢిల్లీ నుంచి స్క్రిప్టులు పంపితే చదవడం తప్ప ఆయన రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకొని రాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతులకు కేంద్రం రుణాలు ఇచ్చిందని మీడియా ముందు కిషన్ రెడ్డి గొప్పలు చెబుతున్నారు. రుణాలివ్వడం కూడా ఒక సాయమేనా అని మంత్రి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియా సమవేశం పెట్టి.. ఢిల్లీ పంపిన స్క్రిప్టును చదువుతుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయం రంగంలో గొర్రెల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23,948 కోట్ల రుణాన్ని ఇచ్చింది. కేంద్ర ఇచ్చిన రుణాలను ఒక మంత్రి గొప్పగా చెప్పుకోవడం సమంజసమా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గి, ఎరువుల వినియోగం పెరిగింది. రూ.6,300 కోట్లతో ప్రారంభించిన రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుంచి అర బస్తా యూరియా అయినా రైతులకు ఇచ్చారా అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
ఒక్క బస్తా యూరియాను వాణిజ్య మార్కెట్‌లోకి పంపలేదు. ఇందులో కేంద్రం రైతాంగానికి చేసిన మేలు ఏముందని నిరంజన్ రెడ్డి అన్నారు. వాస్తవాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మభ్యపెడుతూ.. రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశలో 11 కోట్ల మంది ప్రధానమంత్రి కిషాన్ సమ్మాన్ యోజన లబ్డిదారులు ఉంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 3 కోట్లకు పడిపోవడం వాస్తవం కాదా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు బంధును కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఇచ్చింది రూ.9,500 కోట్లు మాత్రమే అని మంత్రి చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.65 వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి మరిచిపోయారని మండిపడ్డారు. ఫసబ్ బీమా యోజన కేవలం బీమా కంపెనీల ప్రయోజనం కోసమే ఏర్పాటు చేశారు. వాటిలో ప్రీమియం ఎక్కువ, పరిహారం తక్కువని నిరంజర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎల్ఐసీతో భాగస్వామ్యం కుదుర్చుకొని రైతు బీమాను అమలు చేస్తోందని చెప్పారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. రైతు సాగు ఖర్చులను రెట్టింపు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రాల వారీగా సాగు ఖర్చులను బట్టి మద్దతు ధర ప్రకటించాల్సి ఉంటుంది. కానీ.. రాష్ట్రాల విజ్ఞప్తులను పక్కన పెట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటోందని మంత్రి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా కిషన్ రెడ్డి మాట్లాడటం హస్యాస్పదం అన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం, రైతుల విషయంలో ఒక ప్రణాళిక లేదు. ఎరువుల విషయంలో చిత్తశుద్ధి లేదు. పంట మార్పిడిపై అవగాహన లేదని చెప్పారు. వాటన్నింటినీ సక్రమంగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు కనీసం ప్రోత్సాహం లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు.