కిషన్ రెడ్డి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి అంబర్‌పేటకు చేసిందేమీ లేదు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా, అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మంత్రి చెప్పారు.
20 ఏళ్లు ఎమ్మెల్యేగా, గత నాలుగేళ్లుగా కేంద్రమంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి అంబర్‌పేట అభివృద్ధికి చేసింది ఏమీ లేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అంబర్‌పేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో బహిరంగ చర్చకు రావాలని ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాలు విసిరారు. హైదరాబాద్ నగర పరిధిలోని అంబర్‌పేట డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి 20 ఏళ్ల నుంచి నియోజకవర్గానికి (అంబర్‌పేట, హిమాయత్‌నగర్) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని మండిపడ్డారు. దీనిపై చర్చకు తనతో పాటు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా, అన్ని రంగాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని మంత్రి చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం కోసం ఆలోచిస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట వంటి గొప్ప ఆలయ నిర్మాణం చేపట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆలయాల అభివృద్ధి, పండుగలను గొప్పగా నిర్వహించడం కేసీఆర్‌కు తెలిసినంత మరెవరికీ తెలియదన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల కరెంటు అందిస్తున్నామని.. తాగునీటి సమస్యను కూడా పరిష్కరించి.. ఇంటింటికీ నల్లా నీటిని అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ప్రజలు కూడా ఆలోచించి.. పని చేసే వారికే పట్టం కట్టాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తున్నారని మంత్రి చెప్పారు.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) April 19, 2023