Telugu Global
Telangana

కిషన్ రెడ్డి భయపడ్డారా..? బాధపడ్డారా..?

కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేదు. పైగా ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది.

కిషన్ రెడ్డి భయపడ్డారా..? బాధపడ్డారా..?
X

2018తో పోల్చి చూస్తే ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి, సీట్లు పెరిగాయి. కానీ ఆ పార్టీ మాత్రం తీవ్ర నిరాశలో ఉంది. కాంగ్రెస్ కంటే తామే బలంగా ఉన్నామని ఊహించుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 8 సీట్ల దగ్గర ఆగిపోతే.. కాంగ్రెస్ ఏకంగా 64 సీట్లతో అధికారం కైవసం చేసుకుంది. బీజేపీకి కొత్త సీట్లు వచ్చాయి కానీ ఉన్న సీట్లు(హుజూరాబాద్, దుబ్బాక) పోవడంతో నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. అన్నిటికీ మించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అందరికీ టార్గెట్ అవుతున్నారు.

బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బీజేపీ దూకుడు వేరు, కానీ అనూహ్యంగా ఆయన్ను తప్పించి.. కిషన్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించింది అధిష్టానం. అప్పటి నుంచి పార్టీ దూకుడు తగ్గిందని బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చివరకు ఆ ఫలితం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. కేంద్ర నాయకత్వం హడావిడే తప్ప రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. పైగా కిషన్ రెడ్డి అసెంబ్లీ బరిలో కూడా లేరు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కలియదిరిగారు, పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఈ తేడా చూపెడుతూ చాలామంది కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

మొదటికే మోసం..

ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏడాదిలోపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేదు. పైగా ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. దీంతో ముందు తన నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో కిషన్‌ రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. మరి పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణలో కిషన్ రెడ్డి సారథ్యంలోనే బీజేపీ ఎదుర్కొంటుందా, లేక పాత దళపతినే మళ్లీ తెరపైకి తెస్తుందా..? వేచి చూడాలి.

First Published:  7 Dec 2023 9:08 AM IST
Next Story