రేవంత్ చేసిన ఆ ఒక్కపనితో.. కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది
సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ హామీల అమలుపై లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన గ్యారంటీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. గ్యారంటీలను అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఏమొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కిషన్‌రెడ్డి జెండా ఎగురవేశారు.
తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఎక్కడ అమలు చేస్తున్నారని ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. హామీలను నెరవేర్చే స్థితిలో ఆ పార్టీ లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రోజురోజుకు కనుమరుగవుతుందన్న ఆయన..తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పదికిపైగా ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు కిషన్‌రెడ్డి.