తెలంగాణతో జమిలి కుదరదు.. కిషన్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలసి జరిగే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు జరగవన్నారు.
దేశవ్యాప్తంగా వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పై చర్చ జరుగుతోంది. ఒకవేళ జమిలికి ఏకాభిప్రాయం కుదిరినా, మినీ జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమయినా, తెలంగాణ ఎన్నికలు కొన్ని నెలలు వాయిదా పడతాయనే ప్రచారం కూడా ఉంది. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలసి జరిగే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు జరగవన్నారు కిషన్ రెడ్డి.
పదాధికారుల సమావేశం..
తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన విజయవంతం చేసేందుకు పదాధికారుల సమావేశం జరిగింది. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్టు తెలిపారు కిషన్ రెడ్డి. ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతారన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పదాధికారుల సమావేశంలో చెప్పారు కిషన్ రెడ్డి.
బస్సు యాత్రకి ఏర్పాట్లు..
సెప్టెంబర్ 21 నుంచి బీజేపీ నేతల బస్సు యాత్రకు షెడ్యూల్ ఖరారైంది. బస్సుయాత్ర కోసం మూడు రూట్లను బీజేపీ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. బాసర, సోమశిల, భద్రాచలం నుంచి బస్సుయాత్రలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ యాత్రకోసం తెలంగాణను మూడు జోన్లుగా బీజేపీ నాయకులు విభజించారు.
బాసర జోన్ ( ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు)
సోమశిల జోన్ (మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు )
భద్రాచలం జోన్ (ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు )
హైదరాబాద్ లో ఈ మూడు యాత్రలు ఒకేసారి ముగిసేలా ప్లాన్ చేశారు. 19రోజులపాటు 4వేల కిలోమీటర్ల మేర యాత్ర చేపడతారు. బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తారని అంచనా.