తెలంగాణలో బి-టీమ్ రగడ.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?
బీజేపీ కాంగ్రెస్ కి ఎంత దూరమో, బీఆర్ఎస్ కి కూడా అంతే దూరమన్నారు కిషన్ రెడ్డి. తాము గతంలో ఎప్పుడూ బీఆర్ఎస్ తో కలవలేదని, ఇకపై కూడా కలవబోమని చెప్పారు.
ఎవరు ఎవరికి ఎ-టీమ్, ఎవరు ఎవరికి బి-టీమ్.. తెలంగాణలో రాజకీయ పార్టీల పరస్పర విమర్శలతో బి-టీమ్ రగడ మొదలైంది. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. కేటీఆర్, హరీష్ రావు బి-టీమ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. తాము ప్రజల తరపున ఎ-టీమ్ అని, ఏ క్లాస్ టీమ్ అని కౌంటర్లిచ్చారు. ఇక బీజేపీ కూడా బి-టీమ్ వ్యవహారంలో స్పందించింది. తమకి బి-టీమ్ లు ఏవీ లేవని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ఆ రెండూ ఒకటే..
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని.. చాలా సందర్భాల్లో ఆ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. తాజాగా అఖిలేష్ యాదవ్, కేసీఆర్ భేటీని కూడా దీనికి ఉదాహరణగా చెప్పారు కిషన్ రెడ్డి. పాట్నాలో విపక్షాల మీటింగ్ కి వెళ్లిన అఖిలేష్ యాదవ్, ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలవడానికి హైదరాబాద్ వచ్చారని చెప్పారు. ఎవరు ఎవరికి బీ టీమో అర్థమవుతోందని చెప్పారు కిషన్ రెడ్డి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. బీజేపీని విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో, బీఆర్ఎస్ కూడా అంతే దూరమన్నారు. తాము గతంలో ఎప్పుడూ బీఆర్ఎస్ తో కలవలేదని, ఇకపై కూడా కలవబోమని చెప్పారు.