Telugu Global
Telangana

ప్రవీణ్ ఖాతాలో రూ.10 లక్షలు.. మరో ఇద్దరు అనుమానితులు!

కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని సిస్టమ్స్‌కు సంబంధించిన రిమోట్ యాక్సెస్ ప్రవీణ్‌కు తెలుసని.. గ్రూప్-1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా అతడికి అందుబాటులో ఉందని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రవీణ్ ఖాతాలో రూ.10 లక్షలు.. మరో ఇద్దరు అనుమానితులు!
X

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌ను సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. కోర్టు అతడిని కస్టడీకి ఇవ్వడంతో హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో శనివారం విచారించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రవీణ్.. ఓఎంఆర్ షీట్ బబ్లింగ్‌ను తప్పుగా చేసినట్లు గుర్తించారు. అయితే అతడు కావాలనే ఓఎంఆర్ షీట్‌లో తప్పు బబ్లింగ్ చేశాడని సిట్ అధికారులు అంటున్నారు. గ్రూప్-1 పరీక్ష పేపర్‌ను దొంగిలించి.. దాని సహాయంతో తాను మార్కులు సాధించాననే విషయం తెలియ కూడదనే ఇలా తప్పుడు బబ్లింగ్ చేశాడని.. డిస్ క్వాలిఫై అయితే తర్వాత కమిషన్ ద్వారా కానీ, కోర్టు ద్వారా కానీ అర్హత సాధించాలని ప్లాన్ చేసినట్లు సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రవీణ్‌తో పాటు మరో 8 మంది నిందితులను పోలీసులు పూర్తిగా విచారిస్తున్నారు. ఇక ప్రవీణ్ ఖాతాలో అనుమానాస్పద రీతిలో రూ.10 లక్షలు ఉన్నాయని సిట్ అధికారులు అంటున్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు అమ్మడం ద్వారా వీటిని సంపాదించి ఉంటాడని అనుమానిస్తున్నారు. రూ.10 లక్షల్లో రూ.3 లక్షలు వేరే వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ చేశాడని.. ప్రస్తుతం రూ.7 లక్షలు అతడి ఖాతాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రవీణ్‌ని ఎంత ప్రశ్నించినా సమాధానాలు ఇవ్వడం లేదని.. ఈ లీకులతో తనకు సంబంధం లేదని చెబుతున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.

ఇక కంప్యూటర్ల గురించి ప్రవీణ్‌కి కూడా పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని సిస్టమ్స్‌కు సంబంధించిన రిమోట్ యాక్సెస్ ప్రవీణ్‌కు తెలుసని.. గ్రూప్-1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా అతడికి అందుబాటులో ఉందని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ పేపర్‌ను కూడా కొట్టేయాలనే ఆలోచనతో ప్రవీణ్ ఉన్నట్లు చెబుతున్నారు. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి 20 మంది అత్యధిక మార్కులు పొందారు. వీరందరినీ సిట్ అధికారులు విచారించారు. అయితే.. చాలా మంది అభ్యర్థులు జెన్యూన్‌గా ఉన్నారని.. వాళ్లు యూపీఎస్సీతో పాటు ఇతర పరీక్షల్లో కూడా మంచిగా రాసి మార్కులు తెచ్చుకున్నారని.. వారిపై ఎలాంటి అనుమానాలు లేవని సిట్ అధికారులు అంటున్నారు.

అయితే ఇద్దరు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాళ్లు కనీసం బేసిక్ క్వశ్చన్లకు కూడా ఆన్సర్లు చెప్పలేకపోయినట్లు అధికారులు అంటున్నారు. వారిద్దరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారని.. ఒకరికి 107 మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరు కూడా ప్రవీణ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో వీరిద్దరిని లోతుగా విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు.

మరోవైపు నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. బయటి వ్యక్తులు ఎవరైనా అతడిని పేపర్ లీక్ చేయడానికి ప్రోత్సహించారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. కాగా, ఈ విచారణను అడిషనల్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్, సైబర్ క్రైమ్ యూనిట్‌కు చెందిన అధికారులు ఈ విచారణలో పాల్గొంటున్నారు.

First Published:  19 March 2023 7:37 AM IST
Next Story