Telugu Global
Telangana

హత్యా రాజకీయాలను సహించేది లేదు.. సీఎం కేసీఆర్

హత్యా రాజకీయాలను సహించేది లేదని, హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని సీఎం కేసీఆర్ అన్నారు.

హత్యా రాజకీయాలను సహించేది లేదు.. సీఎం కేసీఆర్
X

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయి. అందుకే నీచ రాజకీయాలకు తెరతీశాయని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని చంపాలని ప్రయత్నించారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సహించేది లేదని, హింసాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్థన్ రెడ్డి, పి. విష్ణువర్దన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారందరికీ గులాబీ కండువాలు కప్పి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

ఇలాంటి హేయమైన దాడులకు పాల్పడే వారికి ఎన్నికల్లో తప్పకుండా బుద్ది చెప్తామని కేసీఆర్ అన్నారు. ఇలాంటి విషయాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నాగం ఇప్పుడు మన పార్టీకి బలం..

తెలంగాణ కోసం నాగం జనార్థన్ రెడ్డి పోరాటం చేశారు. 1969 తొలి దశ ఉద్యమంలో నాగం జనార్థన్ రెడ్డి జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. మలి దశలో కూడా మనం అనేక పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణ వచ్చింది. ఈ పదేళ్లలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందింది. తెలంగాణ కోసం పోరాడిన నాయకులు, రాష్ట్ర భవిష్యత్‌ కోసం తోడుగా రావాల్సిన అవసరం ఉందని తాను కోరగానే నాగం జనార్థన్ రెడ్డి అంగీకరించి పార్టీలో చేరారని కేసీఆర్ చెప్పారు.

పాలమూరు నాయకులు, మంత్రి నిరంజన్ రెడ్డికి ఒకటే మనవి చేస్తున్నాను.. మనకు నాగం జనార్థన్ రెడ్డి ఒక బలం.. ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ఉమ్మడి పాలమూరులో 14కు 14 అసెంబ్లీ స్థానాలు గెలిచే విధంగా పని చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే నాగం ఇంటికి వెళ్లి.. ఆయనతో పాటు పార్టీలో చేరిన కార్యకర్తలతో మాట్లాడతాను అని కేసీఆర్ అన్నారు.

విష్ణువర్దన్ రెడ్డి భవిష్యత్‌కు నాది పూచీ..

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి పార్టీలో చేరడం చాలా సంతోషం. ఆయన తండ్రి పీజేఆర్ నాకు మంచి మిత్రుడు. తాను కోరగానే పార్టీలో చేరారు. ఆయన రాజకీయ భవిష్యత్‌కు నాది పూచీ అని సీఎం కేసీఆర్ అన్నారు. విష్ణు కూడా నా కుటుంబ సభ్యుడే.. ఆయనకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, విష్ణువర్దన్ రెడ్డి పాత, కొత్త అనే తేడా లేకుండా సమన్వయంతో పని చేసుకోవాలని కేసీఆర్ కోరారు.

First Published:  31 Oct 2023 9:34 AM GMT
Next Story