Telugu Global
Telangana

ఐ ఫోన్ అప్డేట్ వెర్షన్ ఉండగా.. పాత ఫోన్ ఎందుకు దండగ..?

ఐ ఫోన్ అప్డేట్ వెర్షన్ లాంటివాడిని నేనుండగా ఖమ్మం ప్రజలకు తుమ్మల లాంటి పాత ఫోన్ ఎందుకని ప్రశ్నించారు పువ్వాడ అజయ్. తనని తాను డాలర్ గా పోల్చుకున్న తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. మన కూరగాయల మార్కెట్ లో డాలర్ చెల్లదు కదా అని ప్రశ్నించారు పువ్వాడ.

ఐ ఫోన్ అప్డేట్ వెర్షన్ ఉండగా.. పాత ఫోన్ ఎందుకు దండగ..?
X

ఖమ్మం జిల్లా కేంద్రంలో రాజకీయాలు మాటలతో బాగా వేడెక్కాయి. మాజీ మంత్రి ప్రస్తుత కాంగ్రస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, తాజా మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డాలర్ తో 2వేల రూపాయల నోటుని పోలుస్తూ ఇటీవల వీరిద్దరూ సెటైర్లు పేల్చుకున్నారు. తాజాగా ఐ ఫోన్ పోలికలు తెరపైకి వచ్చాయి. పువ్వాడ అజయ్ కుమార్ తాను అప్డేట్ వెర్షన్ ఐ ఫోన్ లాంటివాడినని అన్నారు. తుమ్మల పాత ఫోన్ అంటూ కౌంటర్ ఇచ్చారు.

ఐ ఫోన్ అప్డేట్ వెర్షన్ లాంటివాడిని నేనుండగా ఖమ్మం ప్రజలకు తుమ్మల లాంటి పాత ఫోన్ ఎందుకని ప్రశ్నించారు పువ్వాడ అజయ్. ఒకప్పుడు మంత్రిని కలవాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితులుండేవని, కానీ ఇప్పుడు మంత్రే ఖమ్మం ప్రజల మధ్యలో ఉంటున్నారని చెప్పారు. తాను ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నానన్నారు. తనని తాను డాలర్ గా పోల్చుకున్న తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ. మన కూరగాయల మార్కెట్ లో డాలర్ చెల్లదు కదా అని ప్రశ్నించారు. డాలర్ బయటది, మనకు వద్దు అని అన్నారు పువ్వాడ. ఖమ్మంని తాను అభివృద్ధి చేస్తే.. పౌడర్ వేసుకొని కొందరు ఇక్కడకు వస్తున్నారని మండిపడ్డారు.

తండ్రి ముఖ్యమంత్రి అయితేనే 3వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చానని చెప్పారు మంత్రి పువ్వాడ. కొడుకు ముఖ్యమంత్రి అయితే ఖమ్మంకి 30వేల కోట్ల రూపాయలు తీసుకొస్తానన్నారు. తుమ్మలకి పదవి వస్తే అహంకారం, మీ అజయ్ కి పదవి వస్తే ప్రజకే అది అలంకారం అన్నారు. మట్టి పనికి పోవాలన్నా మనోడు ఉండాలనే నానుడి ఉండేదని.. కాంగ్రెస్ అభ్యర్థి పరాయివాడని, కానీ తాను ఖమ్మం లోకల్ అని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. పిలిచి మంత్రి పదవి ఇచ్చి, రద్దయిన తుమ్మల రాజకీయ జీవితాన్ని కేసీఆర్ నిలబెడితే.. తిరిగి ఆయన్నే తప్పుబడుతున్నారని చెప్పారు అజయ్.

First Published:  12 Nov 2023 5:28 PM IST
Next Story