రాహుల్ వస్తే రానీ.. బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి ధీమా
శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు ఎంపీ నామా.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన రాకపై బీఆర్ఎస్ ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ సహా ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. గెలుపోటములు తనకు ముఖ్యం కాదని, ప్రజాసేవే ముఖ్యం అని వెల్లడించారు నామా.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారవుతున్నాయి. ఇప్పటికే నలుగుర్ని ఫైనల్ చేశారు. ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే టికెట్ ఇస్తామని ప్రకటించారు కేసీఆర్. అయితే ఖమ్మంలో ఈసారి ఆయనకు ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమధ్య సోనియా గాంధీని ఆహ్వానించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఆమె రాజ్యసభకు వెళ్తుండటంతో రాహుల్ ని ఆహ్వానించారు. రాహుల్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. అయితే అమేథీతోపాటుగా ఆయన తెలంగాణ నుంచి ఖమ్మం లేదా భువనగిరి స్థానాల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ దశలో తన ప్రత్యర్థి రాహుల్ అయినా, ఇంకెవరైనా సరే.. తాను వెనక్కి తగ్గేది లేదన్నారు నామా.
శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు ఎంపీ నామా. మరోమారు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ఆయన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామన్న చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు. రైతులకు కరెంటు, నీళ్ల సమస్య మళ్లీ మొదలైందన్నారు నామా. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కే మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.