ఖైరతాబాద్ గణపతి నేత్రాలంకరణ పూర్తి..
63 అడుగుల మహాగణపతికి 86 అడుగుల భారీ కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను భక్తులు సమర్పిస్తారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులతో వీటిని తయారుచేయించినట్లు తెలిపారు నిర్వాహకులు.
ఖైరతాబాద్ గణపతి విగ్రహ తయారీలో చివరి ఘట్టం నేత్రాలంకరణ పూర్తయింది. 63 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈనెల 18న ఉదయం తొలిపూజ, ప్రాణ ప్రతిష్టతో స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు నిర్వాహకులు.
ఈ ఏడాది విగ్రహం ప్రత్యేకతలు..
ఎత్తు 63 అడుగులు
వెడల్పు 28 అడుగులు
సరస్వతి, వారాహి అమ్మవార్లతో దశహస్తుడి రూపం
120మంది కళాకారుల 3 నెలల శ్రమ
దశ మహా విద్యా గణపతి విగ్రహ నమూనాను ఆగమశాస్త్ర నియమాల ప్రకారం శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో, గ్రాఫిక్ డిజైనర్ శరత్ నల్లనాగుల రూపొందించారు. అనంతరం 120మంది కళాకారులు 3 నెలలపాటు శ్రమించి విగ్రహానికి తుదిరూపునిచ్చారు. విగ్రహ రూపకల్పనకు 20 టన్నుల నాణ్యమైన స్టీలు వాడారు. 25 బండిళ్ల మెష్ వినియోగించారు. వరిగడ్డి, వరిపొట్టు, సుతిలి పొడి, ఇసుక, గోనెసంచులు, కోరబట్ట, సున్నంపొడితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. సహజమైన రంగులతో తుదిరూపునిచ్చారు.
86 అడుగుల భారీ కండువా..
63 అడుగుల మహాగణపతికి 86 అడుగుల భారీ కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను భక్తులు సమర్పిస్తారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులతో వీటిని తయారుచేయించినట్లు తెలిపారు నిర్వాహకులు. చవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్ దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి వీటిని సమర్పిస్తారు.