Telugu Global
Telangana

మెడిసిన్‌ సీట్ల‌లో స్థానిక రిజ‌ర్వేష‌న్‌పై హైకోర్టు కీల‌క తీర్పు

మెడిసిన్‌లో ప్ర‌వేశానికి ముందు నాలుగేళ్లపాటు రాష్ట్రంలో చదవలేదని, నివాసం ఉండలేదన్న కారణంగా శాశ్వత నివాసితులకు స్థానిక రిజర్వేషన్ కోటాను నిరాకరించడం సమర్థ‌నీయం కాదని స్పష్టం చేసింది.

మెడిసిన్‌ సీట్ల‌లో స్థానిక రిజ‌ర్వేష‌న్‌పై హైకోర్టు కీల‌క తీర్పు
X

మెడిసిన్‌ సీట్ల కేటాయింపులో స్థానిక రిజ‌ర్వేష‌న్‌పై హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసితులు సంబంధిత అధికారుల నుంచి నివాస ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే.. వారికి స్థానిక రిజర్వేషన్ కోటా కింద మెడిసిన్‌ సీట్లు కేటాయించాలని కాళోజీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేసింది. మెడిసిన్‌లో ప్ర‌వేశానికి ముందు నాలుగేళ్లపాటు రాష్ట్రంలో చదవలేదని, నివాసం ఉండలేదన్న కారణంగా శాశ్వత నివాసితులకు స్థానిక రిజర్వేషన్ కోటాను నిరాకరించడం సమర్థ‌నీయం కాదని స్పష్టం చేసింది.

రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు 10వ తరగతి వరకు ఇక్కడ చదివి ఇంటర్ మరో రాష్ట్రంలో చదివి ఉండటం, తల్లిదండ్రులు బదిలీపై వెళ్లినందున ఇతర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసి ఉండటం, మధ్యలో కొన్నేళ్లు మరోచోట చదివి, తిరిగి ఇంటర్ ఇక్కడ చదువుకున్నవారికి 85 శాతం స్థానిక రిజర్వేషన్ కోటా కింద కాళోజీ యూనివర్సిటీ ప్రవేశాలను నిరాకరించింది. దీంతో 2017లో జారీ చేసిన మెడిసిన్ లో ప్ర‌వేశానికి సంబంధించి నిబంధనల జీవో 114ను సవాలు చేస్తూ పలువురు కోర్టును ఆశ్ర‌యించారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌ల‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.

వైద్య ప్రవేశాల్లో స్థానిక రిజర్వేషన్లకు చెందిన రూల్ 3(III) (B) రాష్ట్రపతి ఉత్తర్వుల గురించి తీర్పులో ధర్మాసనం చర్చించింది. ఆర్టికల్ 371-డి రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధంగా లేదంటూ సుప్రీంకోర్టు సమర్థించిందని, అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటు గురించి చర్చించలేదంది. అందువల్ల రాష్ట్రపతి ఉత్తర్వుల చెల్లుబాటు గురించి పరిశీలించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపింది.

వైద్య ప్రవేశాల 2017 నిబంధనల ప్రకారం స్థానికంగా 4 ఏళ్లు చదివి ఉండాలి, లేదంటే నివాసం ఉండాలని, అయితే ఇక్కడ పిటిషనర్లు ఎవరూ అలా వరుసగా 4 ఏళ్లపాటు చదవడంతో పాటు, నివాసం ఉండనందున ఈ నిబంధన పరిధిలోకి రారని తెలిపింది. నిబంధనల్లో 2(2) ప్రకారం స్థానికతను చట్టం లేదా ప్రభుత్వం నిర్వచించాల్సి ఉందని, ఇక్కడ స్థానిక అభ్యర్థి అన్నది చట్టంలోగానీ, ప్రభుత్వంగానీ ఎక్కడా నిర్వచించలేదని పేర్కొంది.

శాసనం చేసేవారికి చట్టం గురించి తెలుసని, వారు చెల్లని చట్టాన్ని చేయరని, వారి లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని భాష్యం చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. రూల్ 3(mi)(c) ఉద్దేశం స్థానికులకు రిజర్వేషన్ ను కల్పించడమేనని, అయితే నిబంధనను కొట్టివేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారందరూ రాష్ట్ర విద్యాసంస్థల్లో వైద్య ప్రవేశాలకు అర్హులే అవుతారని వ్యాఖ్యానించింది. అందువల్ల దాన్ని కొట్టివేయడంలేదని, దాన్ని పరిగణనలోకి తీసుకోరాదని పేర్కొంది. ఈ నిబంధన రాష్ట్రంలో ఉన్న శాశ్వత నివాసితులకు వర్తించదని పేర్కొంది.

First Published:  30 Aug 2023 2:24 AM GMT
Next Story