ఆడియో టేపుల్లో వెంకయ్యనాయుడిపై కీలక వ్యాఖ్యలు
వింటే గోడి లేదంటే ఈడీ అంటూ మాట్లాడారు. తెలంగాణలో 35 మంది ఎమ్మెల్యేలు ఈడీ లిస్ట్‌లో ఉన్నారని మాట్లాడుకున్నారు. రామేశ్వరరావు అంటూ పేరు కూడా సంభాషణల్లో వచ్చింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలను బయటపెట్టిన ఆడియో టేపుల్లో కీలకమైన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో వెంకయ్యనాయుడు, ఆయన బ్యాచ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది.
బీఎల్ సంతోష్ ఆర్‌ఎస్‌ఎస్ నుంచే వచ్చారు.. రాష్ట్రపతి కూడా ఆయన చెప్పినట్టు వినాల్సిందే అని కొనుగోళ్లకు వచ్చిన బ్రోకర్లు మాట్లాడుకున్నారు. ప్రతి కేబినెట్ మీటింగ్‌లోనూ సంతోష్ కూర్చుంటారని కూడా బయటపెట్టారు. అవసరమైతే మోడీ, అమిత్ షాలే స్వయంగా బీఎల్ సంతోష్ ఇంటికి వెళ్తారని వెల్లడించారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి ముందు కేంద్ర ప్రభుత్వమే మోకరిల్లుతుందని పరోక్షంగా వెల్లడించారు.
వింటే గోడి లేదంటే ఈడీ అంటూ మాట్లాడారు. తెలంగాణలో 35 మంది ఎమ్మెల్యేలు ఈడీ లిస్ట్‌లో ఉన్నారని మాట్లాడుకున్నారు. రామేశ్వరరావు అంటూ పేరు కూడా సంభాషణల్లో వచ్చింది. బీజేపీకి 100 ఇచ్చేశాడు అందుకే రామేశ్వరరావును వదిలేశామని చెప్పారు. ఆయన చేసిన ఈవెంట్‌కు మోడీ, అమిత్ షా కూడా వచ్చారు కదా అని గుర్తు చేసుకున్నారు.
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇక్కడ ఏం చేశారన్న దానికి సంబంధించి మొత్తం వివరాలు మోడీ దగ్గర ఉన్నాయన్నారు. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో మోడీకి బాగా తెలుసంటూ కిషన్, బండి సంజయ్ గురించి బ్రోకర్లు మాట్లాడుకున్నారు. వెంకయ్యనాయుడిని డమ్మీ చేయడంపైనా చర్చించుకున్నారు. రాష్ట్రపతిని చేయకుండా వెంకయ్యనాయుడిని డమ్మీని చేయలేదా?. ఇప్పుడు వాళ్ల బ్యాచ్ అంతా రిటైర్ అయిపోయారని వెంకయ్యనాయుడిని బ్రోకర్లు ఎద్దేవా చేశారు. కర్నాటకలో 16 మందితో ప్రభుత్వాన్ని కూల్చేశామని గర్వంగా చెప్పుకున్నారు బ్రోకర్లు.
మొత్తం మీద వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని చేయకుండా డమ్మీని చేశామని బ్రోకర్లు చెప్పడం బట్టి.. ఉద్దేశపూర్వకంగానే వెంకయ్యనాయుడి బ్యాచ్‌ని బీజేపీ పెద్దలు తొక్కేశారన్నది స్పష్టమవుతోంది.