Telugu Global
Telangana

కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. జేపీ న‌డ్డాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలోని గుజరాతీ గులాంలు రాసిచ్చిన పాత స్క్రిప్ట్‌నే ఎన్ని సార్లు చదువుతావని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే మాట అనడానికి సిగ్గుండాలని అన్నారు.

కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో.. జేపీ న‌డ్డాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్
X

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్య మంత్రి కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని.. నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా అని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ వచ్చిన ప్రతీ సారి అభివృద్ది మీద విషం చిన్నే మాటలే చెప్తున్నారు. పదే పదే అవే పచ్చి అబద్దాలు చెప్తున్నారు. అది నోరా.. మోరా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంశ్ రెడ్డి స్పందించారు.

తెలంగాణలోని గుజరాతీ గులాంలు రాసిచ్చిన పాత స్క్రిప్ట్‌నే ఎన్ని సార్లు చదువుతావని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనే మాట అనడానికి సిగ్గుండాలని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైసలు ఇవ్వకున్నా.. అవార్డులు మాత్రం ఇస్తుందనే విషయం నడ్డా గుర్తుంచుకోవాలని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.12వేల కోట్ల ఖర్చు చేస్తే.. కేంద్రం కొసిరి కొసిరి ఇచ్చింది రూ.1200 కోట్ల మాత్రమే అని చెప్పారు.

జాతీయ రహదారుల కోసం కాగితాల మీద రూ.1.21 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు చెప్తారు. కానీ ఈ 9 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే అని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుంచి టోల్ ట్యాక్స్ ద్వారా, సెస్‌ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన డబ్బే అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ లెక్కన తెలంగాణలో మరో 30 ఏళ్లకు అయినా మంజూరు చేసిన పైసలు ఖర్చు కావని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధును కాపీ కొట్టి.. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టింది. కానీ ఆ పథకంలో కూడా రైతులకు పలు ఆంక్షలు విధించిందని చెప్పారు. తెలంగాణలో రైతు బంధు కింద తొలుత 49 లక్షల లబ్దిదారులతో మొదలు పెట్టి.. ఇప్పుడు 70 లక్షల మందికి పథకం ద్వారా డబ్బులు జమ చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు రూ.9వేల కోట్ల ఖర్చు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్సల మంది రైతులకు ప్రస్తుత సీజన్ వరకు రూ.72 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

ధరణి వ్యవస్థను రద్దు చేసి మళ్లీ వీఆర్వో వ్యవస్థ తెచ్చి.. రైతులను గోస పెడదామనే ఆలోచన బీజేపీదని దుయ్యబట్టారు. కేసీఆర్ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ రైతులకు ఆసరాగా నిలబడితే.. బీజేపీ మాత్రం రైతులను అరిగోస పెడుతోందని మండిపడ్డారు. పేదలు, రైతులు రెండు కళ్లుగా పని చేస్తున్న కేసీఆర్‌ను జైల్లో పెడతారా అంటూ మండిపడ్డారు. అలా అయితే పంచ భూతాలను అమ్మాకానికి పెట్టి, దేశ సంపదను తన మిత్రులకు దోచి పెడుతున్న నరేంద్ర మోడీని ఎన్ని సార్లు జైల్లో పెట్టాలని జేపీ నడ్డాను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

First Published:  26 Jun 2023 2:58 PM IST
Next Story