Telugu Global
Telangana

ఏడాదంతా పోలవరం గేట్లు తెరిచే ఉంచండి.. పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 48 గేట్లతో పాటు రివర్స్ స్లూయిస్‌ను కూడా ఏడాదంతా తెరిచే ఉంచాలని లేఖలో పేర్కొన్నారు.

ఏడాదంతా పోలవరం గేట్లు తెరిచే ఉంచండి.. పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
X

భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరద ముంపు నుంచి రక్షించాలంటే పోలవరం గేట్లు ఏడాదంతా తెరిచే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి సర్వే పూర్తి కానందున.. అప్పటి వరకు గేట్లను తెరిచే ఉంచాలని డిమాండ్ చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)కు తెలంగాణ ప్రభుత్వం తరపున నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ రావు లేఖ రాశారు. టెంపుల్ టౌన్ భద్రాచలంతో పాటు చుట్టు పక్కల గ్రామాలను వరద ముంపు నుంచి రక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 48 గేట్లతో పాటు రివర్స్ స్లూయిస్‌ను కూడా ఏడాదంతా తెరిచే ఉంచాలని లేఖలో పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం ప్రాంతంలో భారీగా ముంపు ఏర్పడుతుందని తెలిపారు. ముంపు నుంచి రక్షించడానికి వెంటనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. గత కొన్నేళ్లుగా భద్రాచలం పట్టణం, మణుగూరు హెవీవాటర్ ప్లాంట్‌కు ముంపు ముప్పు భారీ పెరిగిందని, గతేడాది వరదల వల్ల ప్రజలను తరలించి ప్రాణనష్టాన్ని తగ్గించినా.. ఆస్తి నష్టాన్ని మాత్రం తగ్గించలేక పోయామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది.

భద్రాచలం చుట్టు పక్కల 28 వేల ఏకరాల ప్రాంతం ముంపునకు గురయ్యింది. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే అనుమానం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా గోదావరికి పెరుగుతున్న వరద చూస్తుంటే.. భారీ ముంపు తప్పదనే అంచనాలు వేస్తున్నారు. పోలవరం గేట్లు తక్షణమే తెరవడమే దీనికి పరిష్కారమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

తెలంగాణ, ఏపీ, ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఇప్పటికే కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ పలు సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్‌లో తెలంగాణకు సంబంధించిన ముంపును అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదని అధికారులు అంటున్నారు.

కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇప్పటికే దుమ్మగూడెం పై నుంచి కలుస్తున్న పలు నదులు, కాలువలకు సంబంధించిన వరద.. గోదావరి ముంపుపై సర్వే చేయడానికి అనుమతి ఇచ్చింది. సారపాక ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, భద్రాచలం పట్టణం, సీతారామ చంద్రస్వామి దేవస్థానం ముంపుకు సంబంధించి స్పష్టమైన నివేదిక సిద్ధం చేయాల్సి ఉన్నదని.. కానీ ఇంత వరకు ఎలాంటి సర్వే జరగలేదని తెలంగాణ అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వెంటనే రక్షణ చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి గతేడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు కూడా ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొన్నది.

First Published:  25 July 2023 10:16 AM IST
Next Story