అన్ని పార్టీల్లో కేసీఆర్ మనుషులు: తమ నీడను చూసి తామే భయపడుతున్న బీజేపీ నాయకులు
అన్ని పార్టీల్లో కేసీఆర్ మనుషులున్నారని, అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి ఆయా పార్టీల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, వారిని తాము గుర్తిస్తున్నామని ఈటల వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నారంటే, అందులోనూ తాము గుర్తిస్తున్నామంటే తమ పార్టీలో కూడా ఉన్నట్టే కదా అని బీజేపీ నాయకులు, కార్యాకర్తల్లో ఆందోళన ప్రారంభమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ ఎత్తుగడలు, వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవు. ఆయన టార్గెట్ ఫలానా వైపు ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటే ఆయన మరో టర్గెట్ ను పేల్చేస్తారు.
ఆయన ఎత్తుగడలకు విపక్ష పార్టీలు కకావికలమవుతుంటాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి, ఏ అంశంలో తమ మీద కోలుకోలేని దెబ్బపడుతుందో విపక్ష నాయకులకు అర్దం కూడా కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో ఆందోళనకు కారణమయ్యాయి.
అన్ని పార్టీల్లో కేసీఆర్ మనుషులున్నారని, అన్ని పార్టీల్లో తన మనుషులను పెట్టి ఆయా పార్టీల్లో అల్లకల్లోలం సృష్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, వారిని తాము గుర్తిస్తున్నామని ఈటల వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నారంటే, అందులోనూ తాము గుర్తిస్తున్నామంటే తమ పార్టీలో కూడా ఉన్నట్టే కదా అని బీజేపీ నాయకులు, కార్యాకర్తల్లో ఆందోళన ప్రారంభమైంది.
ఒక వైపు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ మనుషులున్నారని, వారే పార్టీని ముందుకు కదలనీయకుండా, ఎదగకుండా చేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. మీరు కోవర్టు అంటే కాదు మీరే కోవర్టు అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు కూడా.ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కూడా తన నీడను చూసి తాను భయపడే పరిస్థితి వచ్చింది.
ఈటల వ్యాఖ్యలను బట్టి తమ పార్టీలో కేసీఆర్ మనుషులెవరో ఆయనకు తెలుసునని అర్దమవుతోంది . మరి వారెవరో అధిష్టానానికైనా చెప్పారా ? ఈటల చెప్తున్న టీఆరెస్ కోవర్టులెవరు ? అని ప్రస్తుతం బీజేపీ నాయకుల్లో కార్యకర్తల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈటల మాటలను తేలికగా తీసుకోవద్దని, సీరియస్ గా పరిగణించి కేసీఆర్ మనుషులెవరో వారిని బైటికి పంపాలని పలువురునాయకులు డిమాండ్ చేస్తున్నారు. వారెవరో తేలనంత వరకు ప్రతి ఒక్కరినీ అనుమానంతో చూసే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో అందరం కలిసి పనిచేసే పరిస్థితి లేకుండా పోతుందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మునుగోడు ఎన్నికలప్పుడు తాము తీసుకున్న చాలా నిర్ణయాలు కేసీఆర్ కు తెలిసిపోయాయని, దానికి తగ్గట్టు ఆయన ఎత్తుగడలు వేశారని పలువురు బీజేపీ నాయకులు అంటున్నారు. అంతే కాదు ఈటల చేరికల కమిటీ చైర్మెన్ అయ్యాక చాలా మంది టీఆరెస్ నేతలతో మాట్లాడి బీజేపీలో చేర్పించే ప్రయత్నం చేశారని తన ప్రయత్నాలు సఫలమవుతాయని ఈటల అనుకున్నప్పటికీ ఎవ్వరూ బీజేపీలోకి రాకపోవడానికి కారణం తమ పార్టీలో ఉన్న కేసీఆర్ మనుషులే అని ఈటల భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాను ఎవెవరితో మాట్లాడానో వెంటనే కేసీఆర్ కు తెలిసి పోవడం వల్ల ఆయన జాగ్రత్తపడ్డారని ఈటల భావిస్తుండవచ్చని అనుకుంటున్నారు.
మొత్తానికి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు బీజేపీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ నీడను చూసి తామే భయపడే పరిస్థితి వచ్చిందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.