కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారనని చెప్పారు. కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు.
దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని.. రైతులు, పేదలను రెండు కళ్లుగా చేసుకొని పరిపాలన సాగిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారనని చెప్పారు. కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ మోడల్ కోరుకుంటున్నదని చెప్పారు. కేసీఆర్ పాలన, పార్టీ విధానాలు నచ్చి బీఆర్ఎస్‌లో చేరిన ప్రతీ ఒక్కరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
రెడ్డి సమాజం కేసీఆర్ వల్ల ఎంతో లబ్ది పొందింది..
సీఎం కేసీఆర్ హయాంలోనే రెడ్డి సామాజిక వర్గానికి ఎంతో లబ్ది చేకూరిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న హాస్టల్, సంక్షేమ భవనానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పని చేసిన మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు రెడ్డి సమాజానికి ఏమీ చేయలేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ ఒక్కరే రెడ్డి సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్‌లో రూ.150 కోట్ల విలువైన 15 ఎకరాలు ఇచ్చారని.. భవన నిర్మాణం కోసం మరో రూ.10 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రెడ్డి కులంలో కూడా పేదలున్నారని.. వారి కోసం రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి ట్రస్టు విశేష సేవలు అందిస్తోందని పోచారం తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న వారిలో రెడ్డి సమాజిక వర్గం వారే అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రతీ రెడ్డి కుటుంబానికి అందుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఈ ట్రస్టుకు మరిన్ని నిధులు కావాలని సీఎం కేసీఆర్‌ను కోరతానని స్పీకర్ పోచారం హామీ ఇచ్చారు.