Telugu Global
Telangana

నేను రావట్లేదు.. రేవంత్‌కు కేసీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్రం ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని, దాన్ని కాంగ్రెస్ పార్టీ దయాభిక్షగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నానన్నారు కేసీఆర్. 1969 నుంచి దాదాపు ఐదు దశాబ్ధాలు భిన్న దశలలో, భిన్న మార్గాలలో ఉద్యమం సాగిందని గుర్తుచేశారు.

నేను రావట్లేదు.. రేవంత్‌కు కేసీఆర్ లేఖ
X

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని, దాన్ని కాంగ్రెస్ పార్టీ దయాభిక్షగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నానన్నారు కేసీఆర్. 1969 నుంచి దాదాపు ఐదు దశాబ్ధాలు భిన్న దశలలో, భిన్న మార్గాలలో ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. చరిత్ర పొడవునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచిన దాగని సత్యమన్నారు.

1952 ముల్కీ ఉద్యమంలో నలుగురు విద్యార్థులను కాల్చి చంపినది మొదలు కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగిందన్నారు. ఫజల్‌ అలీ కమిషన్ సిఫార్సులను పట్టించుకోకుండా, ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుచేశారు కేసీఆర్. కష్టాలను తలుచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతుందన్నారు. ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతుందన్నారు.

ఇక ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో తాను పాల్గొనడం సమంజసం కాదని, బీఆర్ఎస్‌ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉందన్నారు. ప్రశ్నించే వాళ్లను అడుగడుగునా అణచివేస్తూ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ వికృత పోకడలను నిరసిస్తూ బీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం లేదన్నారు. ఇకముందైనా వైఖరి మార్చుకుని తెలంగాణ ప్రగతి కోసం పని చేయాలని సూచించారు.

First Published:  1 Jun 2024 1:41 PM GMT
Next Story