Telugu Global
Telangana

జనంలోకి కేసీఆర్.. ఎప్పుడంటే..?

భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు రైతులతోనూ కేసీఆర్ మాట్లాడనున్నారు.

జనంలోకి కేసీఆర్.. ఎప్పుడంటే..?
X

బీఆర్ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీరు అంద‌క ఎండుతున్న పంటలను ఆయన పరిశీలిస్తారు. ఈనెల 29 లేదా 30న కేసీఆర్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి. ఇందుకోసం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.

భువనగిరి, ఆలేరు, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు రైతులతోనూ కేసీఆర్ మాట్లాడనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పడిపోతుండడంతో పంటపొలాలు, పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయడం, బావుల్లో పూడికలు తీస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నల్గొండ జిల్లా నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో పంటల పరిశీలనకు స్వయంగా తానే వస్తానని నేతలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఫిబ్రవరి 13న నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర రోజుల తర్వాత మళ్లీ కేసీఆర్ వస్తుండడంతో జిల్లా నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇవాళ రూట్‌మ్యాప్ ఫైనల్ చేయనున్నారు.

First Published:  27 March 2024 9:07 AM IST
Next Story