వైరల్ అవుతున్న కేసీఆర్ వీడియో.. బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్
మొన్నటి వరకు బెడ్‌కే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా నడుస్తున్నారు. వైద్య సిబ్బంది సహాయంతో ఊతకర్ర పట్టుకుని ఆయన నిదానంగా అడుగులు వేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెడితే, ఆ తర్వాత కేసీఆర్ ని చూసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాస్త అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఎన్నికల ప్రచార సమయంలో రోజుకో బహిరంగ సభతో జిల్లాలన్నీ చుట్టేసి వచ్చిన ఆయన.. ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత కొన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉన్న ఆయన, ఆ తర్వాత ఇంటిలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. కేసీఆర్ త్వరలో పార్టీ నేతలు, కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారనే వార్తలు వస్తున్నా కూడా ఎక్కడో తెలియని అసంతృప్తి. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఆయన చిన్నగా నడుస్తున్న వీడియో చూసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. కేసీఆర్ త్వరలో బయటకు వస్తారని, పార్టీకి ఉత్తేజం వస్తుందని ఆనందపడుతున్నారు నేతలు.
With every step, he’s is reclaiming strength, guided by determination and a trusty stick. It's only a matter of time before he walks freely again. pic.twitter.com/8sPTwEOEoU
— Santosh Kumar J (@SantoshKumarBRS) January 17, 2024
మొన్నటి వరకు బెడ్‌కే పరిమితం అయిన కేసీఆర్.. ఇప్పుడు నెమ్మదిగా నడుస్తున్నారు. వైద్య సిబ్బంది సహాయంతో ఊతకర్ర పట్టుకుని ఆయన నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఇంటి హాల్ లో ఆయన నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ నడుస్తున్న వీడియోని, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ షేర్ చేశారు. దీంతో ఆ వీడియోను అందరూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి.
గతేడాది డిసెంబర్ 8న కేసీఆర్ ఫామ్‌హౌస్ లో కాలు జారి కింద పడగా.. తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే, ఆ తర్వాత ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత 8 వారాల పాటు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పగా.. హైదరాబాద్ నందినగర్‌లోని తన ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో వ్యాయామం చేస్తూ త్వరగా కోలుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ నడుస్తున్న వీడియో బయటకు రావడంతో కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరింత త్వరగా కోలుకుని జనంలోకి రావాలని ఆకాంక్షిస్తూ మెసేజ్ లు పెడుతున్నారు.