గాంధీ స్ఫూర్తితో కరోనాతో యుద్ధం.. అందుకే విజయం..
మహాత్ముడి జయంతి సందర్భంగా గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవా నిరతిని కొనియాడారు సీఎం కేసీఆర్. కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా గడగడలాడించినా.. రాజధాని నడిబొడ్డున అత్యంత ధైర్యంగా ప్రజల ప్రాణాలను కాపాడుతామని ధీమాగా పని చేసిన సంస్థ మన గాంధీ ఆసుపత్రి అని అన్నారు. ఇక్కడి వైద్య బృందం, నర్సులు, సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది అందరూ గాంధీ ఆదర్శాన్ని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పుణికిపుచ్చుకొన్నారని ప్రశంసించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఆస్పత్రి సిబ్బందికి సెల్యూట్..
వసతులున్నా లేకున్నా.. పీపీఈ కిట్స్ ఉన్నా లేకున్నా. గాంధీ వైద్యులు, సిబ్బంది ధైర్యంగా పని చేశారని అన్నారు కేసీఆర్. ప్రైవేటు ఆసుపత్రులు పేషెంట్లను వద్దంటే, గాంధీ వైద్యులు వారి ప్రాణాలు కాపాడారని చెప్పారు. ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు కేసీఆర్. గాంధీ ధ్యానమూర్తి విగ్రహం అద్భుతమైన ఆవిష్కరణ అన్నారు. రాష్ట్రానికే ఈ విగ్రహం గర్వకారణం అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి, ఆరోగ్యంగా, శాంతి, సౌభ్రాతృత్వంతో అద్భుతంగా పురోగమించాలని ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లుగా గాంధీ విగ్రహం కనిపిస్తోందని పేర్కొన్నారు కేటీఆర్.
అహింస అనే అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహాత్ముడు అందరికీ ఆదర్శం అని చెప్పారు సీఎం కేసీఆర్. బ్రిటిష్ వారి వద్ద తుపాకులు, తూటాలు ఉన్నా.. అహింసతో వారిని ఎదుర్కోవచ్చని అందరిలో ధైర్యం నింపి, చివరకు విజయం సాధించారని, అందుకే ఆయన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అని సంబోధించారని, సుభాష్ చంద్రబోస్ బాపూజీ అని ప్రశంసించారని చెప్పారు కేసీఆర్.
విగ్రహం ప్రత్యేకతలు..
ధ్యాన భంగిమలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్య విగ్రహ ఏర్పాటుకి రూ.1.25కోట్లు ఖర్చయింది. ఎత్తు 16 అడుగులు, బరువు 5 టన్నులు. ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిపి హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు.