ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు కేసీఆర్
కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా కేసీఆర్, నాయకులతో చర్చిస్తారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్ నుంచి తన నివాసానికి వచ్చిన కేసీఆర్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన తిరిగి జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికలలోగా ఆయన పూర్తి స్థాయిలో ప్రజా క్షేత్రంలోకి వస్తారనే అంచనాలున్నాయి. ముందుగా కేసీఆర్ తెలంగాణ భవన్ లో వరుస సమీక్షలతో బిజీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన తెలంగాణ భవన్ కు వస్తున్నారు.
కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో ఈరోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశమవుతారు. ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం అందించారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించడం, తదనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. భవిష్యత్ కార్యచరణను నిర్ణయిస్తారు.
అసెంబ్లీ వ్యూహాలు..
కేబినెట్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా కేసీఆర్, నాయకులతో చర్చిస్తారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. అసెంబ్లీ సమావే శాల్లో ఎలా దూకుడుగా ముందుకు వెళ్లాలనే అంశంపై నాయకులకు పలు సూచనలు చేస్తారు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తారన్న సమాచారంతో అక్కడ కోలాహలం నెలకొంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ఆశావహులు కూడా కేసీఆర్ ని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కాంగ్రెస్ హామీలపై నిరంతరం ప్రజల్లో చర్చ జరగాలని, హామీల అమలు ఆలస్యమయ్యే కొద్దీ.. ప్రభుత్వాన్ని నిలదీయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ ఉంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన అస్త్రం కూడా ఇదే. ఏ హామీలతో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిందో.. అవే హామీల అమలు ఆలస్యం అనే అంశంతో లోక్ సభ ఎన్నికలను ఎదుర్కోవాలనుకుంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ తప్పుల్ని ఎత్తి చూపుతూ.. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉనికి ఎంత అవసరమో వివరిస్తున్నారు నేతలు.