Telugu Global
Telangana

నాన్-బీజేపీ అలయన్స్.. కేసీఆర్ 2024 టార్గెట్ అదే

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బలమైన పార్టీగా నిలపాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు.

నాన్-బీజేపీ అలయన్స్.. కేసీఆర్ 2024 టార్గెట్ అదే
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, రైతు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలనే టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్చారు. ఇక ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత సహా.. మంత్రులు, ఎంపీలు, కీలక నాయకులు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.37 గంటలకు సర్దార్ పటేల్‌ రోడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దానికి ముందు సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యులతో కలిసి రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను బలమైన పార్టీగా నిలపాలని కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారు. బీజేపీ సర్కారును గద్దె దించడానికి కలిసి వచ్చే పార్టీలతో ఆయన చర్చలు జరుపనున్నారు. నాన్-బీజేపీ అలయన్స్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ బావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీజీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామితో కేసీఆర్ సమావేశం అవుతారు. ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొని రావడానికి ఏం చేయాలనే విషయంపై ముగ్గురు నేతల మధ్య కీలక చర్చ జరుగనున్నది.

'అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. రైతు ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే విషయంపై వారితో కేసీఆర్ చర్చించనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో రైతుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది.. దాంతో రాష్ట్రంలో జరిగిన మార్పును కూడా వారికి వివరించనున్నారు. ఉమ్మడి ఏపీలో కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎలా మారిందో కూడా చెప్పనున్నారు.

నాన్-బీజేపీ అలయన్స్‌లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర ఉండబోతోంది. అందుకే జనవరిలో ప్రాంతీయ పార్టీల అధినేతలతో సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌తో పాటు వామపక్ష, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. అక్కడే నాన్-బీజేపీ అలయన్స్‌ ఏర్పాటుకు బీజం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ గద్దె దించాలంటే తప్పకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావల్సిన అవసరం ఉందని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆ స్ట్రాటజీతోనే అన్ని పార్టీలను కలుపుకొని పోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.

First Published:  14 Dec 2022 8:14 AM IST
Next Story