మరింత వాడిగా, వేడిగా.. ఈరోజు కేసీఆర్ మూడు సభలు
ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఆదివారం అయినా కూడా ఈరోజు సీఎం కేసీఆర్ మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగే ఈ మూడు ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగం మరింత వాడివేడిగా ఉండే అవకాశముంది. ఇటీవలే అమిత్ షా.. బీసీ సీఎం అనే ప్రకటన చేశారు, మేడిగడ్డ బ్యారేజీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. తెలంగాణలో పర్యటించారు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తో గడబిడ జరుగుతోంది. ఈ అంశాలలో కొన్నిటిపైన అయినా సీఎం కేసీఆర్ స్పందించే అవకాశముంది.
ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు కేసీఆర్. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. 3.50 గంటలకు అక్కడ సభ ముగించుకుని ఆలేరుకి బయలుదేరతారు. సాయంత్రం 4.10 గంటలకు ఆలేరులో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు కేసీఆర్.
ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్ ప్రసంగాల్లో బీజేపీకంటే ఎక్కువగా ఆయన కాంగ్రెస్ ని టార్గెట్ చేశారు. ఆపద మొక్కులు మొక్కూతూ వచ్చేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక్క అవకాశం అంటూ మాయమాటలు చెబితే నమ్మి మోసపోవద్దన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయాలని చెబుతున్నారు. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ కేసీఆర్ మరింత పదునైన వ్యాఖ్యలు చేసే అవకాశముంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగాలు మరింత వాడివేడిగా ఉంటాయని అంటున్నారు.