Telugu Global
Telangana

తెలంగాణ బీజేపీకి అర్థం కాని కేసీఆర్ స్ట్రాటజీ.. ఇలాగైతే గెలిచేది ఎలా పార్టీలో చర్చ!

అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధపడుతోంది. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

తెలంగాణ బీజేపీకి అర్థం కాని కేసీఆర్ స్ట్రాటజీ.. ఇలాగైతే గెలిచేది ఎలా పార్టీలో చర్చ!
X

అధికారంలోకి రావడానికి ప్రతీ రాష్ట్రంలో బీజేపీ అమలు చేస్తున్న స్ట్రాటజీకి అక్కడి ప్రత్యర్థి పార్టీలు లొంగిపోతున్నాయి. తెలంగాణలో మాత్రం.. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నాయకులకు.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను వాడుకొని ముప్పతిప్పలు పెడుతోంది. అయినా సరే ఆ విషయాలపై కేసీఆర్ బయటకు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. పైగా మోడీ ప్రభుత్వంపై విమర్శల దాడిని మరింతగా పెంచారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధపడుతోంది. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ అగ్రనాయత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. పెరిగిపోతున్న ధరలు, రాష్ట్రాలకు రావలసిన నిధులను ఎలా అడ్డుకుంటున్నారు అనే విషయాలపై నిత్యం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేసీఆర్ టార్గెట్ మోడీ, అమిత్ షాలే కావడంతో ఫోకస్ అంతా అటువైపే వెళ్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు నిత్యం సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తుంటారు. అయినా సరే కేసీఆర్ మాత్రం రాష్ట్ర నేతల పేర్లు ఎత్తకుండా మోడీనే టార్గెట్ చేస్తుంటారు. అనవసరంగా బండి సంజయ్, ఇతరుల పేర్లు తీసి విమర్శించడం వల్ల.. వాళ్లకు మైలేజీ ఇచ్చినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీని అసలు పట్టించుకోకపోవడం ఇక్కడి నేతలకు రుచించడం లేదు. ఆ మధ్య మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించిన టేపుల్లో.. బీజేపీ అగ్రనాయకత్వమే ఇక్కడి నాయకులను సైడ్ చేసినట్లు వ్యాఖ్యలు ఉన్నాయి. అది కూడా రాష్ట్ర బీజేపీకి పెద్ద మైనస్‌గా మారింది.

తెలంగాణ బీజేపీలో కేసీఆర్ వంటి నాయకుడిని ఎదుర్కొని నిలబడే వాళ్లే లేరనే సందేశం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది. ఇదే స్ట్రాటజీని కేసీఆర్ మొదటి నుంచి అమలు చేస్తున్నారు. తన పోరాటం మోడీ ప్రభుత్వంపైనే కాని..ఇక్కడి చోటా మోటా లీడర్లతో కాదని తన మాటల ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోలేక రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతీ రాష్ట్రంలో బీజేపీ నరేంద్రమోడీ ఇమేజ్‌ను వాడుకోవాలని ప్రయత్నిస్తుంది. రామ మందిరం సెంటిమెంట్ ఇప్పుడు లేదు. కాబట్టి మోడీని ముందు పెట్టి ఓట్లు అడగాలనే వ్యూహాన్ని ప్రతీ రాష్ట్రంలో అమలు చేస్తోంది.

తెలంగాణలో మోడీని ముందు పెడితే ఇప్పుడు ఓట్లు పడే పరిస్థితి లేదు. దక్షిణాదిలో మోడీకి పెద్దగా ఇమేజ్ లేదు. పైగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది. అందుకే కేసీఆర్ నిత్యం కేంద్ర ప్రభుత్వం, మోడీపై విమర్శలు చేస్తున్నారు. దీని వల్ల తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడే నాయకుడే లేడనే సందేశం కూడా ప్రజల్లోకి వెళ్తోంది. ఇది బీజేపీకి పెద్ద అడ్డంకిగా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే.. కేసీఆర్ స్ట్రాటజీ తప్పకుండా వర్క్ అవుట్ అవుతుందనే చర్చ జరుగుతున్నది.

నాయకత్వ లోపం ఉన్న బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉండదని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పరిపాలనకే తిరిగి జై కొడతారని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదని.. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాత్రం కట్టుదిట్టమైన వ్యూహం అమలు చేయాలనే చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. ఈ సారి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కేసీఆర్ పదే పదే తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు. ఈసారి ఎక్కువ పార్లమెంటు స్థానాలు తనకు కట్టబెట్టాలని కూడా కోరుతున్నారు. అందుకే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని వల్ల ఎంపీ సీట్లను కూడా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఖాతాలో చేరేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు.

కేసీఆర్ స్ట్రాటజీ అర్థం కాకనే బండి సంజయ్ మళ్లీ హిందూ ఓటర్లు అంటూ జపం చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. 80 శాతం ఉన్న హిందూ ఓటర్లు కులాలకు అతీతంగా బీజేపీకి ఓటేయాలని బండి కోరుతున్నారు. అయితే ఉత్తరాదిలో మతం పేరిట పోలరైజ్ అయినట్లు తెలంగాణలో పరిస్థితి ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా కేసీఆర్‌ను ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే బీజేపీ బలమైన నాయకుడిని ముందు పెట్టాల్సి ఉంటుందనే చర్చ జరగుతోంది.

First Published:  8 Dec 2022 9:14 AM IST
Next Story