Telugu Global
Telangana

మహిళల పేరుమీదే పట్టాలు.. అక్కడికక్కడే రైతుబంధు చెక్కులు

గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై కేసులు పెట్టే పరిస్థితి ఉందని, ప్రభుత్వమే ఈరోజు వారికి పట్టాలిచ్చి.. రైతు బంధును మంజూరు చేసిందని చెప్పారు కేసీఆర్. రైతులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.

మహిళల పేరుమీదే పట్టాలు.. అక్కడికక్కడే రైతుబంధు చెక్కులు
X

తెలంగాణలో రైతులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పోడు పట్టాల పంపిణీ మొదలు పెట్టారు. మహిళల పేరుమీదే పట్టాలు అందిస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్.. లబ్ధిదారులకు ఆసిఫాబాద్ లో రైతుబంధు చెక్కులు కూడా అందించారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ పూర్తవుతుందన్నారాయన.

సమాజం చైతన్యవంతం అవుతున్న కొద్దీ రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51వేల మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పోడు పట్టాలు పొందేవారిలో గిరిజనేతరులు కూడా ఉన్నారని, అయితే, 75 ఏళ్లుగా వారు ఒక చోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసం ఒక ప్రక్రియను తీసుకొస్తామన్నారు.


గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై కేసులు పెట్టే పరిస్థితి ఉందని, ప్రభుత్వమే ఈరోజు వారికి పట్టాలిచ్చి.. రైతు బంధును మంజూరు చేసిందని చెప్పారు కేసీఆర్. రైతులపై నమోదైన కేసులన్నిటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు 3ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తామని, ‘గిరివికాసం’ పథకం కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆఫీస్ ని ప్రారంభించారు. కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ల సముదాయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. పోడు పట్టాల పంపిణీని మొదలు పెట్టారు.

First Published:  30 Jun 2023 4:36 PM IST
Next Story