మనం పనిచేసే బాకీ ఉన్నాం -కేసీఆర్
తెలంగాణ నుంచి ఫ్యాక్టరీలు తరలి పోతుంటే తనకు బాధగా ఉందన్నారు. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు ఎంత పనిచేశారని అన్నారు కేసీఆర్.
తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, ఇంకా ఉందని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సుయాత్రలో భాగంగా వీణవంక కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఉందని చెప్పారు. తెలంగాణకు మనం పనిచేసే బాకీ ఉన్నామని, ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు కేసీఆర్. మళ్లీ సాగునీరు నిరంతరాయంగా రావాలని, 100శాతం కరెంటు ఉండాలని, అది జరగాలంటే మళ్లీ మనం అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. తెలంగాణ నుంచి ఫ్యాక్టరీలు తరలి పోతుంటే తనకు బాధగా ఉందన్నారు. నాలుగైదు నెలల్లోనే దుర్మార్గులు ఎంత పనిచేశారని అన్నారు కేసీఆర్.
ఇవాళ రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయింది. అల్యూమినియం, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతున్నది.
— BRS Party (@BRSparty) May 5, 2024
నాలుగైదు నెలల్లోనే తెలంగాణ నుండి కంపెనీలు వెళ్లిపోతుంటే చాలా బాధగా ఉంది - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.#VoteForCar… pic.twitter.com/gcJ34UZGAr
ఎన్నికలు ఎప్పుడొచ్చినా..
నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఇంకోటి లేదన్నారు కేసీఆర్. మళ్లీ ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు మధ్యలో వచ్చినా, చివరకు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మళ్లీ మనదే గెలుపు అని చెప్పారు. వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, తనపై నమ్మకం ఉంచండని చెప్పారు కేసీఆర్.
అది కూడా తెలియదా..?
రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు కేసీఆర్. ఇది ఎలాంటి పరిపాలనో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ మళ్లీ మర్లవడ్డదని అన్నారు కేసీఆర్. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్రం గౌరవం పెంచి పరిశ్రమలు తీసుకొస్తే.. ఇప్పుడు వాటిని తరిమేస్తున్నారని అన్నారు. రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు కేసీఆర్. అల్యూమినియం, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కరెంటు కోతలు పెడతోందని, రోజుకు ఐదారుసార్లు ట్రిప్ అవుతోందని.. మధ్యలో పని ఆగిపోయి కంపెనీల యాజమాన్యం ఇబ్బంది పడుతోందని అన్నారు. వారంతా తెలంగాణతో లాభం లేదని, వెళ్లిపోవాలనుకుంటున్నారని చెప్పారు. నాలుగైదు నెలల్లోనే ప్రభుత్వం ఎంత పనిచేసిందంటూ పెదవి విరిచారు కేసీఆర్.