Telugu Global
Telangana

కేసీఆర్ సార్.. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? బీజేపీ నాయకుల్లో అసహనం!

కేసీఆర్ తమను విమర్శించినన్ని రోజులు తామే బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీలా ప్రజలకు కనపడ్డామని.. కానీ ఇప్పుడు తమను పట్టించుకోక పోవడంతో వెనుకబడిన ఫీలింగ్ వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్ సార్.. మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? బీజేపీ నాయకుల్లో అసహనం!
X

మనల్ని ఎవరైనా పట్టించుకోక పోయినా.. మనతో మాట్లాడక పోయినా ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా మన ప్రత్యర్థి 'సైలెన్స్' అత్యంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపీ నాయకుల పరిస్థితి అలాగే ఉంది. నిన్న మొన్నటి వరకు సీఎం కేసీఆర్.. బీజేపీ నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కానీ ఇటీవల ఎక్కడ బహిరంగ సభ జరిగినా కాంగ్రెస్ పార్టీ పాలనలోని వైఫల్యాలను ప్రస్తావిస్తూ.. వారిపై విమర్శణ బాణాలు ఎక్కుపెడుతున్నారు.

సీఎం కేసీఆర్ అసలు బీజేపీని పట్టించుకోకపోవడంతో రాష్ట్ర నాయకులు అసహనానికి గురవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేసీఆర్ తమను విమర్శించినన్ని రోజులు తామే బీఆర్ఎస్‌కు ప్రధాన పోటీలా ప్రజలకు కనపడ్డామని.. కానీ ఇప్పుడు తమను పట్టించుకోక పోవడంతో వెనుకబడిన ఫీలింగ్ వస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం కేసీఆర్ మాపై విమర్శలు చేస్తే.. వాటిని తిప్పికొట్టడానికి అయినా ప్రెస్ మీట్లు పెట్టి మీడియాలో రోజూ కనపడే వాళ్లం. కానీ ఇప్పుడు ఆయన వ్యూహాత్మకంగానే మమ్మల్ని పట్టించుకోవడం మానేశారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కూడా కావాలనే బీజేపీని పక్కన పెట్టారని తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా లేని పార్టీని విమర్శించి.. అనవసర ప్రచారం చేయడం ఎందుకని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, బీఆర్ఎస్ విజయాలను ప్రచారం చేయడం వల్లే పార్టీకి, ప్రభుత్వానికి మంచి ప్రచారం జరుగుతుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ చేసి చూపించింది. ఇవే మరోసారి తెలంగాణలో అధికారాన్ని కట్టబెడుతుందని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.

ఇటీవల పలు బహిరంగ సభల్లో కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్న ధరణిపై కేసీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటివి అందుతున్నాయనంటే దానికి ధరణినే కారణమని చెప్పారు. అలాంటి ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని కాంగ్రెస్ రద్దు చేయడం అంటే.. రైతు బంధు, రైతు బీమాను రద్దు చేయడమే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

సీఎం కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుండటంతో.. బీజేపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి తామే అని ఇన్నాళ్లూ చెప్పుకున్నామని.. తీరా ఎన్నికల సమయం వచ్చే సరికి బీజేపీని అసలు పట్టించుకోకపోవడం పెద్ద మైనస్‌గా మారిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే కాకుండా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వంటి సీనియర్లు కూడా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు.

ఇలా బీఆర్ఎస్ నాయకులందరూ బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో మీడియాలో కూడా బీజేపీ ముచ్చట లేకుండా పోయిందని బాధపడుతున్నారు. ఇలా అయితే తాము మూడో స్థానానికే పరిమితం అవుతామని ప్రజలు కూడా భావించే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. కేసీఆర్ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం వల్ల తమపై అటెన్షన్ తగ్గిపోయిందని దిగులు పడుతున్నారు. ఏదేమైనా.. కేసీఆర్ సార్ మమ్మల్ని కూడా విమర్శించండి అని బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు.

First Published:  9 Jun 2023 2:57 PM IST
Next Story