Telugu Global
Telangana

ఓటమితో దిష్టిపోయింది.. కేసీఆర్ కామెంట్స్‌

కేసీఆర్ మీద ద్వేషంతో అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయన్నారు.

ఓటమితో దిష్టిపోయింది.. కేసీఆర్ కామెంట్స్‌
X

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్‌కు దిష్టి తీసినట్లయిందన్నారు ఆ పార్టీ చీఫ్‌ కేసీఆర్. బుధవారం మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, నల్ల‌గొండ జిల్లాల నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జిమిక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామన్న విషయం ప్రజలకు అర్థమైందని, మరికొద్ది రోజుల్లోనే ప్రజలు టార్చ్‌లైట్ పట్టుకుని బీఆర్ఎస్ పార్టీ కోసం వస్తారన్నారు.


కేసీఆర్ మీద ద్వేషంతో అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయన్నారు. తన చేష్టలతో ప్రజలతో చీ కొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్‌ వైఖరని చెప్పుకొచ్చారు కేసీఆర్. ఈ విషయం క్షేత్రస్థాయిలోనూ కనిపిస్తోందన్నారు.

ఇక తనను కలిసేందుకు వస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ఓ విజ్ఞప్తి చేశారు కేసీఆర్. వేలాది మందితో నిలబడి ఫొటోలు దిగడం కాలిరిగిన తనకు ఇబ్బందిగా ఉందని, తనను కలిసేందుకు ముందస్తు సమాచారంతో రావాలని సూచించారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని, చెప్పిన నియోజ‌క‌వ‌ర్గాల వారు మాత్రమే వస్తే మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు.

First Published:  4 July 2024 7:41 AM IST
Next Story