Telugu Global
Telangana

కేసీఆర్, రేవంత్.. ఇలా కలుస్తారని ఎవరూ అనుకోలేదు..

కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆకాంక్షించారు. ఆయన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్, రేవంత్.. ఇలా కలుస్తారని ఎవరూ అనుకోలేదు..
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి పలకరింపు ఇలా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. గతంలో వారు ముఖాముఖి కలిశారో కలవలేదో ఎవరికీ అనవసరం.. కానీ రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిద్దరు తొలి సారి ఇలా ఆస్పత్రిలో పలకరించుకోవడం, అది కూడా పరామర్శ పర్వం కావడం మాత్రం నిజంగా విచిత్రమే. నిన్న మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి పలకరించారు. చేతులో జోడించి నమస్కారం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి. పక్కన మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.


బాత్రూమ్‌ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడింది, వైద్యులు వాకర్‌ సాయంతో ఆయనను నడిపించారు. ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆకాంక్షించారు. ఆయన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అవసరమని అన్నారు రేవంత్ రెడ్డి.

డాక్టర్లు ఏమన్నారంటే..?

కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు వైద్యులు. చాలా వేగంగా ఆయన కోలుకుంటున్నారని అన్నారు. సాధారణంగా తుంటి కీలు మార్పిడి జరిగిన పేషెంట్‌ ను 12 గంటల్లోపు నడిపించే ప్రయత్నం చేస్తామని, దీన్ని మెడికల్‌ పరిభాషలో ‘మొబిలైజేషన్‌ స్టార్ట్‌’ అంటారని వివరించారు. కేసీఆర్‌ కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉందని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని, మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. డిశ్చార్జి తర్వాత మరో రెండు నెలలపాటు ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెబుతున్నారు.

First Published:  10 Dec 2023 10:59 AM GMT
Next Story