Telugu Global
Telangana

దొంగలతో కలిసేవారితో మాకు బాధలేదు -కేసీఆర్

"ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణ సాధించిన మనకు ఇలాంటివి ఓ లెక్కనా..?" అని అన్నారు కేసీఆర్.

దొంగలతో కలిసేవారితో మాకు బాధలేదు -కేసీఆర్
X

తెలంగాణలో ఫిరాయింపు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. మేం నిజాయితీపరులం, నిఖార్సయినవాళ్లం, పార్టీ మారేది లేదంటూ ఘంటాపథంగా చెబుతున్న వారే పక్క పార్టీ కండువా కప్పుకోడానికి ముందు వరుసలో ఉంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా ఇలానే చేశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా వచ్చిన వార్తలపై ఇటీవలే ఆయన ఘాటుగా స్పందించారు, తాను అలాంటివాడిని కాదన్నారు, సీన్ కట్ చేస్తే ఈరోజు ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఇలా పార్టీ మారే వాళ్లతో బీఆర్ఎస్ కి వచ్చిన నష్టమేమీ లేదని కేసీఆర్ అన్నారు. పార్టీని వీడి దొంగలతో కలిసేవారి గురించి బాధ లేదని ఆయన తేల్చి చెప్పారు.


"ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణ సాధించిన మనకు ఇలాంటివి ఓ లెక్కనా..?" అని అన్నారు కేసీఆర్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో తనను కలిసేందుకు వచ్చిన నాయకులతో ఆయన మాట్లాడారు. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది కానీ, నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. అప్పుడైనా, ఇప్పుడైనా మెరికల్లాంటి యువకుల్ని నాయకులుగా పార్టీ తయారు చేసిందని, చేస్తుందని భరోసా ఇచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామన్నారు కేసీఆర్.

కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వచ్చిన వందలాది కార్యకర్తలు ఈరోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు కూడా కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు, పార్టీ బలోపేతంపై చర్చించారు. కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్.రమణ తదితరులు ఈరోజు కేసీఆర్ ని కలిశారు.

First Published:  28 Jun 2024 6:02 PM IST
Next Story