కేసీఆర్ ప్రజాపథం.. రేపటినుంచి రోడ్లపైకి గులాబీ రథం
కేసీఆర్ ప్రచారంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు ఘాటుగా ఉంటాయని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనతో పోలిక చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరిస్తారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. కేసీఆర్ ప్రజాపథంతో ఈ ప్రచారం మరింత స్పీడందుకోబోతోంది. మొత్తం 17రోజులపాటు కేసీఆర్ ప్రజల్లోనే ఉండేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మొదలవుతుంది. 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర కొనసాగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అయితే ఆయ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రచారానికి వచ్చి అనంతరం తిరిగి అక్కడికే వెళ్లిపోయేవారు. కానీ ఈసారి మాత్రం 17రోజులపాటు ఆయన ఇంటికి దూరంగా కేవలం ప్రచారంలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారు.
ఈ నెల 24న తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సుయాత్ర మొదలుతుంది. మిర్యాలగూడకు చేరుకునే వరకు దాదాపు 100 వాహనాల భారీ కాన్వాయ్ కేసీఆర్ బస్సుని అనుసరిస్తుంది. పెద్ద ఎత్తున ఈ బస్సుయాత్రకు ఏర్పాట్లు జరిగాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటల లోపు స్థానికంగా రైతులు, మహిళలు, యువత.. ఇతర వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం స్థానిక నేతలతో మీటింగ్ లు ఉంటాయి. సాయంత్రం వాతావరణం చల్లబడిన తర్వాత రోడ్ షోలు మొదలవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తారు. రోడ్ షోలు ముగిసిన తర్వాత రాత్రి బస వద్దకు చేరుకుంటారు కేసీఆర్. అక్కడ మరోసారి స్థానిక నేతలతో సమావేశం ఉంటుంది.
కేసీఆర్ ప్రచారంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు ఘాటుగా ఉంటాయని తెలుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనతో పోలిక చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రజలకు వివరిస్తారు. బీఆర్ఎస్ పాలన అవసరాన్ని ఆయన నొక్కిచెబుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయినా.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని, ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఏమాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.